Mahanaadu-Logo-PNG-Large

పల్నాడు హింసాత్మక ఘటనలపై హైకోర్టు సీరియస్‌

అదనపు బలగాలు పంపాలని ఆదేశం

అమరావతి, మహానాడు : పల్నాడులో జరుగుతున్న హింసాత్మక ఘటనలను నివారించాలని, జరిగిన ఘటనలపై విచారణ చేబట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ తెలుగు దేశం న్యాయవాదుల విభాగం కార్యనిర్వాహక సభ్యులు వినుకొండకు చెందిన నల్లబోతు రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్‌ జ్యోతిర్మయి వాదనలు విన్నారు. పిటిషనర్‌ తరపున న్యాయవాదులు రవితేజ పదిరి, పిళ్లా యశ్విని వాదనలు వినిపించారు. పల్నాడు వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరుగుతు న్నాయని తెలిపారు. నరసరావుపేటలో ఎన్నికల రోజు అనేక ఘటనలు జరిగాయని వివ రించారు.

మాచర్ల, సత్తెనపల్లి, ఇతర చోట్లా జరిగాయని, ఎన్నికల అనంతరం కూడా జరుగుతున్నాయని వాటి నివారించడంలో విఫలమయ్యారని తెలిపారు. పిటిషనర్‌ అధికారులకు పెట్టిన అర్జీని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. తమ వద్ద ఉన్న రికార్డింగ్‌ ను కోర్టుకు వినిపించే యత్నం చేయగా జడ్జి కల్పించుకుని రాష్ట్రమే కాదు.. ఏం జరిగిం దనేది ప్రపంచం మొత్తం చూసింది. కొత్తగా వినటానికి ఏం లేదన్నారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘం న్యాయవాది వివరణ ఇస్తూ పిటిషనర్‌ అర్జీ పరిశీలనలో ఉందని వివరిం చారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ తరపున వివరాలు కనుక్కోవడానికి సమయం కావాలని కోరగా కేసును పాస్‌ ఓవర్‌ చేసిన ధర్మాసనం మరలా సాయంత్రం 4:30 గంటలకు విచారణ చేబట్టింది.

హోంశాఖ అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడరు వివరణ ఇస్తూ పిటిషనర్‌ అర్జీ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ విషయమై చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సంఘం డీజీపీ, ఎస్పీ నుంచి వివరణ కోరిందని పేర్కొన్నారు. తర్వాత మరలా వాదనలు వినిపించిన పిటిషనర్‌ తరపు న్యాయవాది జిల్లాలో అదనపు బలగాలు లేకపోవటం వల్ల అదుపు చేయలేకపోతున్నారని తమ దృష్టికి వచ్చిందని కోర్టుకు వివరిం చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఇటువంటి హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా, మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరగకుండా చూడాలని ఆదేశిస్తూ కావాల్సిన అదనపు బలగాలు పంపించాలని ఆదేశించింది.