హిందుత్వ హీరోలు.. ఆ ఇద్దరే!

– ఏపీ రాజకీయాల్లో తెరపైకి హిందుత్వ నినాదం
– బీజేపీ వెనక్కి.. రఘురామరాజు-పవన్ ముందుకు
– నాడు జగన్‌పై రఘురామ మతమార్పిడి అస్త్రం
– చర్చి నిర్మాణాలకు సర్కారీ నిధులపై ఫిర్యాదు
– జగన్ జమానాలో రఘురామ హిందూ జపం
– ఆ కోపంతోనే రఘురామరాజుపై ఎస్సీఎస్టీ కేసులు
– మళ్లీ ఇప్పుడూ నిజమైన క్రైస్తవంపై వ్యాఖ్యలు
– గుడి ఆవరణలో సిగరెట్లు తాగితే సహించాలా అని ఫైర్
– బెదిరిస్తే హిందువులు భయపడాలా అంటూ ఎదురుదాడి
– అదే దారిలో జనసేనాధిపతి పవన్‌కల్యాణ్
– ‘ఆంధ్రా బాల్‌థాకరే’గా అవతరిస్తున్న పవన్
– తిరుమల అపచారంపై ప్రాయశ్చిత్త దీక్ష
– హిందువుల జోలికొస్తే సహించేదిలేదని వార్నింగ్
– కొవ్వుపట్టిన మాటలంటూ పొన్నవోలుపై ఫైర్
– మసీదు-చర్చిలలో అలా జరిగితే ఊరుకుంటారానన్న ప్రశ్నలు
– ఒక మతాన్ని విమర్శించడమే సెక్యులరిజమానని వాతలు
– హిందుత్వ కోసం ప్రాణాలర్పిస్తానని స్పష్టీకరణ
– పల్లెపల్లెకూ జనసేన ప్రాయశ్చిత్త దీక్ష
– పవన్‌-రాజు కు హిందువుల్లో పెరుగుతున్న ఇమేజ్

( మార్తి సుబ్రహ్మణ్యం)

కులాలతో కంపుకొట్టే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మత రాజకీయాలు తెరపైకొచ్చాయి. ఫలితంగా ఇప్పుడు రాష్ట్రంలో హిందుత్వ నినాదం ప్రతిధ్వనిస్తోంది. తిరుమల అపచారం నేపథ్యంలో, అటు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. ఇటు జనసేనాధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హిందుత్వానికి ప్రతినిధులుగా..హిందూ చాంపియన్లుగా రూపాంతరం చెందుతున్నారు. అందులో పవన్ ఇంకో మెట్టెక్కి ‘ఆంధ్రా బాల్‌థాకరే’గా అవతరిస్తుండటం ఆసక్తికరం.

వారిద్దరు కలి‘విడి’గా.. హిందుత్వను వెక్కిరించే శక్తులకు నేరుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సెక్యులరిజమంటే ఒక మతాన్ని మాత్రమే సమర్ధించటం కాదంటూ.. సెక్యులర్ మంత్రం జపించే, రాజకీయ పార్టీలకు కర్రుకాల్చి వాతలు పెడుతున్నారు. ఫలితంగా.. హిందుత్వపై పేటెంటీ ఉందని భ్రమించే బీజేపీ పూర్తిగా వెనకబడిపోగా, పవన్-రాజు ముందుకొచ్చారు. కారణం.. టీటీడీ బోర్డు నియామకంలో బీజేపీ సిఫార్సుల పాపమే.

‘‘సనాతన ధర్మం కోసం ప్రాణాలర్పిస్తా. ఆ ధర్మానికి జరిగే హానిపై మౌనం సరికాదు. లౌకికకవాదానికి భంగం కలిగితే కచ్చితంగా నిలదీస్తా. లడ్డు నెయ్యి కల్తీపై ప్రతి హిందువు మాట్లాడాలి. మౌనం మంచిదికాదు. తిరుమల ఘటన వంటిది ఏ మసీదులోనో, చర్చిలోనో జరిగితే ఇలాగే మాట్లాడతారా? హిందువుల మనోభావాలు దెబ్బతినప్పుడు కూడా సెక్యులరిస్టులు స్పందించాలి. సెక్యులరిజమంటే వన్‌వే కాదు. టూ వే’’

– బెజవాడ కనకదుర్గ ఆలయ మెట్లు శుభ్రం చేసే ప్రాయశ్చిత్త దీక్షలో జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్య.

‘‘అంబేద్కర్ బుద్దిస్ట్. క్రిస్టియన్ కాదు. దళితులమని చెప్పుకునేవారు నిజమైన క్రైస్తవులు కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించనివారు అంబేద్కర్ వారసులు కారు. నిజమైన క్రైస్తవులకు కులం ఉండదు. బీసీ(సీ) అవుతారు. అలాంటప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు కోసం వారెలా ఫిర్యాదుచేస్తారు? కులరహిత మతం ఆచరిస్తూ, కులం ఆచరిస్తామంటే కుదరు. గతంలో కేంద్రం కూడా ఇదే చెప్పింది. రాజ్యాంగంలో ఉన్నది చెబితే బెదిరిస్తారా? ఏలూరుపాడు నాగేంద్రస్వామి ఆలయానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని భక్తుల కోరికమేరకే నేను తీసేశా. అయినా గుడి దగ్గర కూర్చుని అన్యమతస్తులు సిగరెట్లు తాగుతుంటే, ఒక హిందువుగా నేను మౌనంగా కూర్చోవాలా? గుడికి అడ్డంగా ఫ్లెక్సీలు కడితే తొలగించకుండా ఉండటానికి, మేమేమైనా గాజులు తొడుక్కుని కూర్చుకున్నామా? మేం ఎప్పుడైనా మసీదు-చర్చిలకు అడ్డంగా ఫ్లెక్సీలు కట్టామా? ముస్లిం-క్రిస్టియన్లకు బోర్డు ఉన్నట్లుగానే హిందువులకూ బోర్డు ఉండాలని పార్లమెంటులో గళం విప్పిన ఏకైక ఎంపీని నేనొక్కొడినే’’
– ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి రఘురామకృష్ణంరాజు.

నిజానికి ఒక రాజకీయ పార్టీలో కొనసాగుతూ, సెక్యులర్ మంత్రం జపించే పార్టీ నేతలు ఇంత ధైర్యంగా, ఒకమతం పక్షాన మాట్లాడటానికి చాలా గుండెలుండాలి. అంతకుమించిన తెగింపు ఉండాలి. అన్నింటికీమించి ఆ మతంపై వారికి చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ పవన్ కల్యాణ్-రఘురామకృష్ణంరాజుకు దండిగా ఉన్నట్లు, వారి ఘాటు వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.

మతపార్టీ అయిన మజ్లిస్ నేతలు. ముస్లింల కోసం మాట్లాడటంలో వింతేమీ లేదు. ఓట్ల కోణంలో మైనారిటీల కోసం కాంగ్రెస్ – హిందువుల కోసం బీజేపీ మాట్లాడటంలో కొత్తదనమేమీ ఉండదు. కానీ సెక్యులర్ పార్టీలో ఉండే పవన్-రాజు, హిందుత్వ గురించి మాట్లాడటమే కాదు. హిందుత్వానికి జరుగుతున్న అపచారం-అవమానంపై, నదురుబెదురు లేకుండా స్వేచ్ఛగా ఎదురుదాడి చేయడమే ఆశ్చర్యం.

అందుకే ఇప్పుడు ఆ ఇద్దరూ హిందుత్వహీరోలయ్యారు. హిందువులు వారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు. తాము గెలిపించిన హిందూ ఎమ్మెల్యే-ఎంపీలు చేయలేని పనిని, వారిద్దరూ చేస్తున్నందుకు నీరాజనాలు పడుతున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డులో, జంతుకళేబరాల కొవ్వు వాడారన్న విషయం ల్యాబ్ నివేదికలతో స్పష్టమయింది. దానిపై హిందూ సమాజం ఇంకా ఉడికిపోతూనే ఉంది. ఈ అపచారంపై స్వామీజీలు ధర్మాగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు. టీటీడీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రభుత్వం ఈ వ్యవహారం నిగ్గుతేల్చేందుకు ఐజితో సిట్ వేసింది.

ఈ క్రమంలో ప్రజాదరణ విపరీతంగా ఉన్న ఇద్దరు నేతలు..సనాతన ధర్మరక్షణ కోసం ప్రపంచం పిక్కటిల్లేలా, పిడికిలి బిగించి చేస్తున్న హిందుత్వ సింహనాదం, వారిని హిందూసమాజంలో హీరోలుగా మార్చింది. అందులో ఒకరు జన సేనాధిపతి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే.. మరొకరు ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరిలోనూ ఫైర్ ఉంది. ఇద్దరిదీ ఎవరినీ ఖాతరు చేయని నైజం. ఇప్పుడు సనాతనధర్మరక్షణలోనూ, వారిద్దరిదీ ఒకటే దారి.

తిరుపతి లడ్డు వివాదం తెరపైకి రాకముందు.. టీటీడీలో అన్యమత ఉద్యోగులు, ఎంపీ నిధులతో చర్చిలకు నిధులు, ప్రభుత్వ నిధులతో చర్చి నిర్మాణాలపై పార్లమెంటులో గళం విప్పి-వాటిపైఫిర్యాదు చేసిన తొలి ఎంపీ రఘురామకృష్ణంరాజు. హిందువులకూ ఒక బోర్డు ఉండాలని, మతం మారిన వారి సర్టిఫికెట్లు రద్దు చేయాలని, టీటీడీ బోర్డు చైర్మన్లుగా అన్యమతస్తులు ఎలా ఉంటారని నిలదీసిన నాయకుడు కూడా ఆయనే.

తిరుమల లడ్డు ఎపిసోడ్ నేపథ్యంలో.. తన నియోజకవర్గంలోని నాగేంద్ర ఆలయంలోకి భక్తులు వెళ్లకుండా, అంబేద్కర్ ఫొటోతో అడ్డంగా కట్టిన ఫ్లెక్సీని తొలగించారు. గుడి ప్రాంగణంలో సిగరెట్లు తాగుతూ, హిందూ మతాన్ని ఎలా అవమానిస్తారంటూ కన్నెర్ర చేశారు. అసలు అంబేద్కర్ క్రిస్టియన్ కాదు. బుద్దిస్ట్ అని పేల్చిన బాంబు, మతం మారిన దళితుల ఆగ్రహానికి గురైంది.

మాజీ ఎంపి హర్షకుమార్ అక్కడికి వచ్చి, ఎమ్మెల్యే రాజును హెచ్చరించిన వైనం కలకలం సృష్టించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మతం మారని దళితులతోపాటు, యావత్ హిందూసమాజం రాజుకు బాసటగా నిలబడింది. సనాతన ధర్మానికి అవమానం జరిగితే సహించేది లేదు. దానిరక్షణ కోసం ఎందాకైనా వెళతానని రాజు మరోసారి స్పష్టం చేశారు. దానితో ఆయన హిందువుల్లో హీరోగా నిలిచారు.

అటు పవన్ కల్యాణ్ సైతం.. బీజేపీ సిగ్గుపడేలా.. సనాతన ధర్మరక్షణకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు, ఆయనను హిందువులలో హీరోగా మార్చాయి. సెక్యులర్ పార్టీ అయిన టీడీపీ సర్కారులో భాగస్వామిగా ఉంటున్నప్పటికీ, ఏమాత్రం మొహమాటం లేకుండా హిందూధర్మపరిరక్షణకు సంబంధించి పవన్ చేస్తున్న భావోద్వేగ వ్యాఖ్యలు, చేస్తున్న ప్రాయశ్చిత్త యాత్రలు ఆయనను మరో ‘ఆంధ్రా బాల్‌థాకరే’గా మారుస్తున్నాయి.