సామాన్యుడి ప్రాణాన్ని కాపాడిన హోమ్ మంత్రి అనిత కాన్వాయ్

– పోలీస్ డ్రైవర్ అప్రమత్తత
– ఏలూరు జిల్లా కైకరం జాతీయ రహదారిపై ఘటన

ఏలూరు జిల్లా: రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఎస్కార్ట్ డ్రైవర్ అప్రమత్తతతో ఓ సామాన్యుడి నిండు ప్రాణానికి ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం హోమ్ మంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ కైకరం వద్దకు చేరే సరికి రోడ్డు పక్కన వెళ్తున్న ఓ ద్విచక్ర వాహన దారుడు అదుపుతప్పి ఒక్కసారిగా కుడి వైపు వెళ్తున్న కాన్వాయ్ వైపు ఒరిగి పడిపోయాడు.

అయితే క్షణ కాలంలో జరిగిన ఘటనతో వెంటనే అప్రమత్తం ఆయిన హోమ్ మంత్రి ఎస్కార్ట్ డ్రైవర్ ద్విచక్ర వాహనదారుడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని, తమ పోలీస్ వాహనాన్ని పక్కకు తప్పించి, సడెన్ బ్రేక్ వేశారు.. దీంతో కాన్వాయ్ మొత్తం ఒక్కసారిగా ఆగింది.ఆ ఘటనలో హోమ్ మంత్రి అనిత ప్రయాణిస్తున్న కారును మరో కార్ స్వల్పంగా డీ కొట్టగా, మంత్రి ప్రయాణిస్తున్న కారు బంపర్ స్వల్పంగా డ్యామేజ్ అయింది.

అకస్మాత్తుగా జరిగిన ఘటనతో ఏమి జరిగిందా అని అందరూ ఒకింత ఆందోళన చెందగా, అనంతరం విషయం తెలుసుకుని, సామాన్యుడి ప్రాణానికి, కాన్వాయ్ లోని హోమ్ మంత్రి అనితకు ఎలాంటి ప్రమాదం జరగపోవటంతో పోలీస్ భద్రతా సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహన దారుడిని క్షేమంగా పక్కకు తీసుకు వెళ్లారు. హోమ్ మంత్రి అనిత వేరే కార్ లో బయలుదేరి వెళ్ళిపోయారు