Mahanaadu-Logo-PNG-Large

ముగ్గురు వైసీపీ అభ్యర్థుల హౌస్‌ అరెస్ట్‌

-పల్నాడు జిల్లాలో భారీగా బలగాలు
-అడుగడుగునా పోలీసులతో తనిఖీలు
-మూడు నియోజకవర్గాలపై నిఘా
-కొనసాగుతున్న 144 సెక్షన్‌

నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ అనంతరం జరుగుతున్న దాడు లు, అల్లర్ల నేపథ్యంలో పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కారంపూడి, కొత్త గణేషునిపాడులో హింసాత్మక ఘటనలు జరిగినందున బలగాలను మోహరించారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై పోలీసు ఉన్నతాధికారు లు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 19 కంపెనీల బలగాలను మోహరించారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ కూడా అక్కడే ఉన్నారు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు జల్లెడ పట్టి తనిఖీలు చేస్తున్నారు. పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో వైసీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గురజాలలో కాసు మహేశ్‌రెడ్డి, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశా రు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ముగ్గురి కంటే ఎక్కువమంది గుమిగూడవద్దని ఎస్పీ బిందుమాధవ్‌ హెచ్చరించారు. సామాన్యుల జీవనానికి ఆటంకాలు కలిగించబోమ న్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.