జగన్‌ ఎలా ముద్దాయి అవుతారు?

జగన్‌ పై కేసు నమోదు అక్రమం
పోలీసులు ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారు
ఇది ఏ మాత్రం సమంజసం కాదు
భవిష్యత్తులో అది వారికే ఇబ్బందిగా మారుతుంది
మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవస్ధలను, ముఖ్యంగా పోలీస్‌ వ్యవస్ధను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడం కోసం, పాలకపక్షం పోలీస్‌ వ్యవస్ధను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్ధకు హాని కలిగిస్తూ, ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఎలా పని చేస్తుందో చెప్పడం కోసమే ఈరోజు మీడియా ముందుకు వచ్చినట్లు మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వెల్లడించారు.

11,2024 సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో పాటు, కొందరు పోలీస్‌ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎఫ్‌ఐఆర్‌ క్రైమ్‌ నెం:187/2024 రిజిస్టర్‌ చేశారని, అందులో 307 సెక్షన్‌ కింద కేసు పెట్టారని మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.

2021, మే 14న, అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు కాగా, ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి సంబంధిత జ్యూరిస్‌డిక్షన్‌ పరిధి, గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. కాగా ఆనాడు, పోలీస్‌ కస్టడీలో తనను టార్చర్‌ చేశారంటూ.. విచిత్రంగా మూడేళ్ల తర్వాత.. అంటే గత నెల 11న, రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్‌పీకి ఫిర్యాదు చేశారని.. దాని ఆధారంగా చూపుతూ.. పోలీసులు నిన్న (జూలై 11వ తేదీ) జగన్‌పై కేసు నమోదు చేశారని మాజీ ఏఏజీ తెలిపారు.

రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నెల రోజుల తరవాత పోలీసులు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎవరినో సంతోషపెట్టడం, మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే ఈ కేసు నమోదు చేసినట్లుందని అన్నారు.
నాడు రఘురామను గుంటూరు కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఫిర్యాదుకు ఏ మాత్రం పొంతన లేదని మాజీ ఏఏజీ తెలిపారు.

ముఖానికి రుమాలు కట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు, పోలీసు కస్టడీలో తనను టార్చర్‌ చేశారని ఆనాడు మెజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన రఘురామ, గత నెలలో చేసిన ఫిర్యాదులో విచిత్రంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పారని, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు సునీల్, సీతారామాంజనేయుల పేర్లు ప్రస్తావించారని, అలాగే తన టార్చర్‌ వీడియోను జగన్‌ చూశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.

మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే, అందులో ప్రస్తావించిన వారందరిపైనా ఇప్పుడు కేసు నమోదు చేయడం ఎంత వరకు సబబు అని మాజీ ఏఏజీ ప్రశ్నించారు. అసలు ఈ కేసులో జగన్‌ ఎలా ముద్దాయి అవుతారని ఆయన నిలదీశారు.

పోలీసు కస్టడీలో తనను ఫలానా వారు టార్చర్‌ చేశారని, రఘురామకు మూడేళ్ల తర్వాత గుర్తొచ్చిందా? అని మాజీ ఏఏజీ ప్రశ్నించారు. కేవలం దురుద్దేశం, ద్వేషంతోనే రఘురామ ఫిర్యాదు చేశారని, దానిపై పోలీసులు అత్యుత్సాహంగా స్పందించారని ఆయన ఆక్షేపించారు. నాడు మెజిస్ట్రేట్‌ ఎదుట రఘురామ చెప్పిందేమిటి? మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేసిందేమిటి? అని కనీసం పోలీసులు ఆలోచించరా? అని పొన్నవోలు ప్రశ్నించారు.

రఘురామ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, జగన్‌ ని, డాక్టర్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చడం సరికాదని మాజీ ఏఏజీ పేర్కొన్నారు. ఇంకా నయం కేసు వాదనకు అడ్వకేట్‌ను నియమించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

పాలించే వ్యక్తి మారితే రాజ్యాధికారం కూడా మారుతుందా? ఆ వ్యక్తికి వంత పాడుతుందా? అసలు చట్టం, న్యాయం, ప్రాథమిక సూత్రాలు ఏంటి?. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 77 రోజుల తర్వాత సాక్షులను విచారించడమే సరికాదని తేల్చి చెప్పింది. అలాంటప్పుడు మూడేళ్ళ తర్వాత విచారిస్తే ఏం జరుగుతుంది?. అని మాజీ ఏఏజీ పొన్నవోలు సూటిగా ప్రశ్నించారు.

రఘురామ ఫిర్యాదు మీద, న్యాయసలహా తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారన్న మాజీ ఏఏజీ.. అసలు రఘురామ గత నెల 11న ఈ–మెయల్‌ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. అంతకు ఒక రోజు ముందే.. అంటే జూన్‌ 10వ తేదీనే.. పోలీసులు లీగల్‌ ఒపీనియన్‌ ఎలా పొందారని గట్టిగా నిలదీశారు.

రఘురామ ఫిర్యాదు చేస్తారని పోలీసులు ముందుగానే కల గన్నారా?. రిపోర్టు రాక ముందే లీగల్‌ ఒపీనియన్‌కు ఎలా రాశారు? పైగా అదే రోజు లీగల్‌ ఒపీనియన్‌ ఎలా వచ్చిందని మాజీ ఏఏజీ సూటిగా ప్రశ్నించారు.

ఇది పూర్తిగా తప్పుడు కేసు అని.. ఎవరినో ఇబ్బంది పెట్టాలనో.. దాని ద్వారా మరెవరినో సంతోషపెట్టాలన్న ఉద్దేశంతోనే కేసు నమోదు చేసినట్లుగా ఉందని మాజీ ఏఏజీ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటామని ఆయన వెల్లడించారు.

ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన విధానం సరికాదని మాజీ ఏఏజీ అన్నారు. ఇదే ట్రెండ్‌ అలవాటు చేస్తే, భవిష్యత్తులో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఎవరో వచ్చి మీ మీద కేసు పెడితే ఏం చేస్తారు?. ఇప్పుడున్న అధికారులు రేపు కేసుల్లో ఇరుక్కుంటారు కదా? అని ప్రశ్నించారు. అందుకే ఇది ప్రజాస్వామ్య వ్యవస్ధకే కళంకమని పొన్నవోలు వ్యాఖ్యానించారు.

ఎవరిని వేధించాలా అనేది రెడ్‌ బుక్‌ ఆధారంగా చేస్తున్నారని, అందులో పేర్లు రాసుకుని వారిని ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఏఏజీ తెలిపారు.

అధికారంలో ఉన్న వ్యవస్ధలను ఇలా విచ్ఛిన్నం చేస్తే ఎలా? అని ప్రశ్నించిన ఆయన, ఇంత అన్యాయంగా కేసులు నమోదు చేయడం సరికాదని తేల్చి చెప్పారు. వేటాడి, హింసించి ప్రాణాలు తీసిన పరిస్ధితుల్లో కూడా 307 సెక్షన్‌ కింద కేసులు పెట్టలేదని గుర్తు చేశారు.

ఈ విధంగా పోలీస్‌ వ్యవస్ధను అడ్డు పెట్టుకుని రాజ్యం నడపాలనుకోవడం తప్పు అన్న మాజీ ఏఏజీ సుధాకర్‌రెడ్డి.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేయలేదని చెప్పారు. 2015లోనే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ఆ కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. అందుకే ఆ కేసుకూ, ఇప్పుడు రఘురామ పెట్టిన కేసుకూ సంబంధం లేదని స్పష్టం చేశారు.

నిజానికి రఘురామను ఆనాడు, పోలీస్‌ కస్టడీలో ఏ మాత్రం టార్చర్‌కు గురి చేయలేదని, ఇదే విషయాన్ని నాడు హైకోర్టులో కూడా నివేదించారని మాజీ ఏఏజీ వెల్లడించారు. నాడు రఘురామ కోరినట్లుగా, ఆయనను పరీక్షించిన ప్రైవేటు మెడికల్‌ టీమ్‌ కూడా, తనపై ఎలాంటి గాయాలు లేవని రిపోర్ట్‌ ఇచ్చిందని తెలిపారు.

ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి, వైద్య పరీక్షల కోసం ఆర్మీ ఆస్పత్రికి వెళ్లిన రఘురామ, అలా హైదరాబాద్‌ వెళ్లినప్పుడు, పోలీసు కస్టడీ లేకుండా సొంతకారులో ఒక్కరే వెళ్లారని మాజీ ఏఏజీ గుర్తు చేశారు. పోలీసుల మాటను ఖాతరు చేయకుండా, అలా వెళ్లిన రఘురామ, ఆర్మీ ఆస్పత్రిలో తన శరీరంపై గాయాలు చూపారని.. దాన్ని బట్టి.. ఆయన ప్రయాణంలో ఏం జరిగి ఉంటుందన్న విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.