Mahanaadu-Logo-PNG-Large

ఇంటిపేరులో సాని ఎలా వచ్చిందంటే..

పెమ్మసాని, చలసాని, మేడసాని, పోసాని వంటి ఇంటిపేర్లు కమ్మవారిలోనూ, ముద్దసాని, కాటసాని, గంగసాని, శూరసాని వంటి ఇంటిపేర్లు రెడ్డివారిలోనూ, ఇంకా బలిజలు, పెరిక బలిజల వంటి అనేక కులాల్లో బొమ్మసాని, కందసాని, ముప్పసాని, శిరసాని, సందసాని, సోమసాని, సుగసాని వంటి ఇంటిపేర్లు తరచుగా వినబడుతుంటాయి. చలసాని అశ్వనీదత్, మేడసాని మోహన్, పోసాని కృష్ణమురళి, ముద్దసాని దామోదర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరుల పేర్లు మనకి సుపరిచితమే. సాని అంటే వాడుకలో అశ్లీలమైన అర్ధం ఉంది. మరి ఇంటిపేర్లలో ఇలా సాని అని ఎందుకు వాడుతున్నారు ?

ఇక్కడున్న సాని అసలు రూపం సాహిణి. సాహిణి అంటే రౌతు. గుర్రమెక్కి పోరాడే యుద్ధవీరుడ్ని సాహిణి అంటారు. నార్త్ ఇండియాలో ఉన్న “సహానీలు” కూడా అటువంటి అశ్వయుద్ధవీరులే. ఈ ఇంటిపేర్లలో ముందున్న భాగం వ్యక్తిపేరు. రెండోభాగం సాహిణి అని వృత్తిని సూచిస్తుంది. వాడుకలో చలమ-సాహిణి చలసానిగా, కాటమ-సాహిణి కాటసానిగా, గంగన-సాహిణి గంగసానిగా రూపాంతరం చెందాయి.

పెమ్మ-సాహిణి లో పెమ్మె(పెరిమె) అంటే ప్రసిద్ధి చెందిన అని అర్ధం. పెమ్మెసాహిణి కాస్తా పెమ్మసాని అయింది. మిగతా ఇంటిపేర్లు కూడా ఇలానే మార్పు చెందాయి. వీరంతా కాకతీయ, విజయనగర, మధుర, తంజావూరు సామ్రాజ్యాల సైన్యంలో పనిచేసిన యుద్ధవీరులు. అమర నాయంకరులు. వారి తర్వాత తరాలకు ఈ ఇంటిపేర్లు సంక్రమించాయి.

ఈ మధ్య వెధవలు కొందరు ఇంటిపేరులో సాని ఉంది కనుక వక్రభాష్యాలు అంటగడుతూ, సోషల్ మీడియాలో ఇతర కులాలమీద హేళనగా పోస్టులు రాస్తూ శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారు. అటువంటి నీచులకి ఇటువంటి సరైన చారిత్రిక, భాషాపరిజ్ఞానంతో బుద్ధి చెప్పండి. వారి దుష్ప్రచారాన్ని ఎదుర్కొనండి.

– అడుసుమల్లి సుబ్బారావు