– ఎసైన్డ్ భూముల లావాదేవీలపై సిసోదియా ఆరా
భోగాపురం: విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు భూముల రికార్డుల్లో తేడాలను గుర్తించామని, వాటిపై చర్యలకు దిగాలనే ఆదేశాలు జారీ చేశామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా చెప్పారు. భోగాపురం సమీపంలో ఉన్న 22ఏ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను సిసోదియా పరిశీలించారు.
విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం కొత్త మరడపాలెం సమీపంలో ఉన్న 22ఏ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ఆర్పీ సిసోదియా పరిశీలించారు. ఎఫ్సీఓ అడంగల్ తదితర భూముల రికార్డుల వివరాలను ఆర్డీవో సూర్యకళను అడిగి తెలుసుకున్నారు.
రైతులతో మాట్లాడి ఎవరు కొనుగోలు చేశారు? ఎంత భూమి కొనుగోలు చేశారు? అన్న అంశాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి భోగాపురం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి పలు దస్త్రాల వివరాలను అడిగి వాటిని పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు భూముల రికార్డుల్లో తేడాలను గుర్తించామని, వాటిని సరిచేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. భూముల రికార్డులను పరిశీలించడానికి, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రోజుకో జిల్లా చొప్పున పర్యటిస్తున్నట్లు ఆర్పీ సిసోడియా తెలిపారు.
దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం పోలిపల్లి, బసవపాలెం గ్రామాలను సందర్శించామని, ఎఫ్‌సీఓ, పాత అంగల్, 22 ఏ జాబితాలను పరిశీలించామని చెప్పారు. పలు రికార్డుల్లో, భూముల వర్గీకరణలో గుర్తించిన తేడాలను గుర్తించామని వాటిని సరిచేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
జిల్లాలో సుమారు 5,700 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయడం జరిగిందని, దానిలో 191 ఎకరాలు వరకు రిజిష్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ జరిగిందా లేదా?, రిజిష్ట్రేషన్లు సక్రమంగా జరిగాయా? లేదా అన్నది కూడా పరిశీలన జరుగుతోదంని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి ప్రజలనుంచి సుమారు 80 వినతులను స్వీకరించామని, వాటన్నిటినీ పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని సిసోడియా తెలిపారు.
అంతకుముందు తహసీల్దార్ల సమీక్షలో మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద కేటాయించిన భూముల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మాలో సమర్పించాలని సిసోడియా ఆదేశించారు. ఈ పథకం క్రింద మొత్తం ఎంత భూమి కేటాయించారు. అందులో ఎంత ప్రభుత్వ భూమి, ఎంత డి పట్టా భూమి, ఎంత భూమిని కొనుగోలు చేసారు, ఎంత డబ్బు పరిహారంగా చెల్లించారు, ఇళ్ల కోసం కేటాయించంగా ఎంత భూమి మిగిలింది, లబ్ది దారుల అర్హత వివరాలతో సహా నిర్దేశిత ప్రొఫార్మాలో రెవెన్యూ సదస్సుల లోపల సమర్పించాలని సూచించారు.
గత 5 ఏళ్లలో 22 ఏ క్రింద నోటిఫై చేసిన భూముల వివరాలను, వెబ్లాండ్ మ్యుటేషన్ సేవల రిపోర్ట్లను మండల వారీగా పరిశీలించారు. రీ సర్వే అంశాల పై తహసీల్దార్లతో చర్చించారు. 20 ఏళ్ల క్రితం వరకు ఫ్రీ హోల్డ్లో ఉన్న భూములను వెరిఫికేషన్ చేయవలసి ఉంటుందని అన్నారు. జిల్లాలో అసైన్డ్ భూముల వివరాలను, రైతుల కోసం, ఇళ్ల కోసం కేటాయించిన వాటి వివరాలను వేర్వేరుగా తహసీల్దార్లు నివేదికలు ఇవ్వాలని తెలిపారు.
తహసిల్దార్ కార్యాలయాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు: సబ్ రిజిస్ట్రార్ రికార్డులలో ఉన్న వివరాలు తహసీల్దార్ రికార్డు లలో ఉన్న వివరాలు ఒకటే ఉండాలని అన్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డులకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఆయా కార్యాలయాలకు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కల్పించే విధంగా పటిష్టమైన భద్రత వ్యవస్థను ఏర్పరిచేందుకు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో కార్యాలయాల వద్ద వాచ్ మెన్‌లను నియమించాలన్నారు.
రెవెన్యూ కార్యాలయాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన భద్రత చర్యలను తీసుకోవాలని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పోలీస్ శాఖ వారితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలన్నారు.