అదానీతో దేశానికి నష్టమైనప్పుడు.. తెలంగాణకు లాభం ఎట్లా అవుతుంది?

-అదానీపై ఢిల్లీ కాంగ్రెస్ ది ఒకమాట. గల్లీ కాంగ్రెస్ ది మరో మాటనా?
-అదానీ-సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి
-ఢిల్లీలో పోరాటం అంటూ తెలంగాణలో రెడ్ కార్పెట్ పరుస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం
-రాష్ట్రాన్ని అదానికి అప్పచెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆపగలిగే శక్తి రాహుల్ గాంధీకి ఉన్నదా అని సూటి ప్రశ్న
-అదానీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేనేలేదని స్పష్టీకరణ
-రాహుల్ ను నిలదీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్‌: హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులిచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ కంపెనీకి స్వాగతం పలకడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సూటిగా ప్రశ్నించారు. అదానీపై జాతీయ కాంగ్రెస్ కు ఒక నీతి.. ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు మరో నీతా ?? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

“ఒక వైపు మీరేమో… అదానీ-సెబీ ఆరోపణలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నారు కానీ ఇక్కడ మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమో.. అదానీకి స్వయంగా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అదానీ కంపెనీకి ద్వారాలు తెరుస్తున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏకంగా అదానీకే అప్పగిస్తున్నారు” అని కేటిఆర్ ధ్వజమెత్తారు.

మీరు ఆదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తే.. అదానీ-కాంగ్రెస్ మిలాఖాత్ పైనా, లోపాయికారి ఒప్పందాలపైనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ స్పష్టంచేశారు. అదానీ వల్ల దేశానికి నష్టం అన్నప్పుడు.. మరి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం లాభమెలా అవుతుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో.. అదానీ కంపెనీల ఆగమనాన్ని రాహుల్ గాంధీకి ఆపగలరా.. కాంగ్రెస్ సీఎం నిర్వాకాన్ని నిలదీసే ధైర్యం చేయగలరా.. అదానీ పెట్టుబడులకు ఫుల్ స్టాప్ పెట్టగలరా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేయగలరా..?? అంత శక్తి రాహుల్ గాంధీకి ఉన్నదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

అదానీపై ఢిల్లీ కాంగ్రెస్ ది ఒకమాట. గల్లీ కాంగ్రెస్ ది మరో మాటనా? అన్న కేటీఆర్ అదానీపై కాంగ్రెస్ చేస్తున్నట్టు చెబుతున్న పోరాటంలో… చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ఒక జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ లో…ఈ ద్వంద్వ వైఖరి.. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కాదా అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ రెండు నాల్కల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాల్ని కూడా నిశితంగా పరిశీలిస్తోందని గుర్తుచేశారు. కాంగ్రెస్ కు అధికారమిచ్చిన పాపానికి.. తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టంచేశారు. తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే పార్టీ బీఆర్ఎస్ అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్ట కోవాలన్నారు.