ప్రభుత్వంపై విశ్వాసం ఉండడంతోనే.. వరద బాధితులకు భారీగా విరాళాలు

గుంటూరు, మహానాడు: వరద బాధితుల సహయార్థం ముఖ్యమంత్రి సహయనిధికి 425 కోట్లు విరాళాలుగా అందించడం ప్రభుత్వం పై ఉన్న విశ్వాసానికి, దాతల మానత్వానికి ప్రతీక అని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మానవత ప్రధాన సలహ దారుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం గుంటూరులోని మానవత కార్యాలయం నుండి మానవత సంస్థ ఆధ్వర్యంలో లక్ష రూపాయల విలువచేసే వంట సామగ్రిని రాయపూడి లంక గ్రామ వరద బాధితులకు అందించే వాహనాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావులు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ వరదల సందర్భంగా పంటలు కోల్పోయిన కౌలు రైతులకు నష్టపరిహరం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 602 కోట్లు రూపాయలు 4 లక్షల మంది వరద బాధితుల ఖాతాలలో జమ చేసిందని గుర్తు చేశారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 115 శాఖల ద్వారా 70 వేల మంది సభ్యులు 15 లక్షల రూపాయల విరాళాలను సేకరించి వరద బాధితులకు బహుముఖ సేవలనదించడం అభినందనీయమన్నారు.

వరదల సందర్భంగా నష్టపోయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విలువ చేసే నోట్ పుస్తకాలను అందిస్తామని రమేష్ ప్రకటించారు. మానవత ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ వరదల సందర్భంగా మూగజీవాలకు గ్రాసం అందించామని, బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. మానవత కార్యదర్శి కె. సతీష్ ప్రసంగిస్తూ వంట సామగ్రిని దానం చేసిన పలు కుటుంబాల గృహిణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మానవత నిర్వాహకులు రామినేని సత్యనారాయణ, చావా శివాజీ, ఉప్పల సాంబశివరావు, బి.ఎన్. మిత్ర, ఎన్.సాంబశివరావు, టి. ధనుంజయ రెడ్డి తదితరులు ప్రసంగించారు.