Mahanaadu-Logo-PNG-Large

వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం డంప్‌

మంగళగిరిలో పట్టుకున్న సెబ్‌ అధికారులు
కాండ్రు కమల ఇంటి సమీపంలో..
అదుపులో దామర్ల వీరాంజనేయులు

గుంటూరు: మంగళగిరిలో వైకాపా నాయకుడి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని భారీ పరిమాణంలో సెబ్‌ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకు న్నారు. స్థానిక వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్య తల్లి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న దామర్ల వీరాంజనేయులు అనే వైకా పా నాయకుడి ఇంట్లో ఈ నిల్వలు బయటపడ్డాయి. మద్యం సీసాలపై ఉన్న స్టిక్కర్లు తొలగించేసి ఆ సరుకు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ‘హైదరాబాద్‌ బ్లూ’ బ్రాండ్‌ 120 బాక్సులు, ‘ఓల్డ్‌ ట్రావెన్‌’ బ్రాండ్‌ 16 బాక్సుల్లో కలిపి మొత్తం 6,528 మద్యం సీసాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 9.79 లక్షలుగా అంచనా వేశారు.

వాటిని స్వాధీనం చేసుకుని వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు సెబ్‌ అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందు ఇంత భారీస్థాయిలో మద్యం లభ్యం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవలి ఎన్నికల్లో లావణ్య గెలుపు కోసం వీరాంజనేయులు పనిచేశారు. కొందరు వైకాపా నాయకులు సెబ్‌ కార్యాలయానికి వెళ్లగా, అదే సమయానికి మీడియా కూడా చేరుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. సాయంత్రం 4 గంటలకు మద్యం స్వాధీనం చేసుకుంటే, రాత్రి 9 వరకూ సమా చారం బయటకు పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.