–ప్రసిద్ధ పుణ్య క్షేత్రం టీటీడీలో పర్యావరణ పరిరక్షణ పద్ధతులు
–గ్లోబల్ మోడల్‌గా మార్చాలనుకుంటున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ
–ఇంధన సామర్థ్య చర్యలతో విద్యుత్ వినియోగం తగ్గించే చర్యలు
–హైదరాబాద్‌లో పర్యావరణ నిర్వహణపై అంతర్జాతీయ సదస్సులో వెల్లడి
విజయవాడ: భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ లైఫ్ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)లో భాగంగా విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సుస్థిర జీవనం, దక్షిణ భారతదేశం అంతటా ఇంధన సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించే ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తోంది.
అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతినిలోనూ మిషన్ లైఫ్ కార్యక్రమాలను అమలు చేయాలని బీఈఈ భావిస్తోంది. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూకే సహకారంతో ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమాటిక్స్ అక్టోబరు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన పర్యావరణ నిర్వహణపై 4వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ (ఐసీఈఎం)లో దీనిపై ప్రధానంగా చర్చించినట్లు బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఏ చంద్రశేఖరరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏటా మిలియన్ల మంది భక్తులు సందర్శించే ఈ క్షేత్రంలో మిషన్ లైఫ్ సూత్రాలను ప్రచారం చేయడం ద్వారా, యాత్రికులు, స్థానిక జనాభాను పర్యావరణ హితంగా నడుచుకునేలా చేయాలనేది బీఈఈ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
ఈ సదస్సులో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ మోహన్, ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్‌ఫోర్డ్ బ్లేడ్, ఇటలీలోని బసిలికాటా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ బెనియామినో ముర్గాంటే, ఐఎస్‌జీ చైర్మన్ డాక్టర్ చౌహాన్, ఐఎస్‌జీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె. మృత్యంజారెడ్డిలతో పాటు ప్రఖ్యాత పర్యావరణవేత్త డాక్టర్ పురుషోత్తం రెడ్డి, ఐఎస్‌జీ, ఐసీఈఎం కార్యదర్శి డాక్టర్ టి.విజయలక్ష్మి పాల్గొని ప్రసంగించారు.
పునరుత్పాదక ఇంధన రాయితీలు, కాలుష్య నిబంధనలు, అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలతో సహా ఇంధన సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే విధానాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను వీరంతా వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, మైసూర్, చెన్నై, తిరువనంతపురం వంటి జనాభా ఎక్కువ ఉన్న నగరాలపైనా, గ్రామీణ, పట్టణ ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వారు వెల్లడించారు.
గ్లాస్గోలోని కాప్26లో మిషన్ లైఫ్‌ని ప్రారంభించినప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన విజన్‌ను సాధించడంలో వ్యక్తులు, సంఘాల పాత్ర చాలా కీలకం. వ్యర్థాలను తగ్గించడం, వనరులను సంరక్షించడం, గ్రీన్ ఎనర్జీ పద్ధతుల వైపు మళ్లడంపై మిషన్ లైఫ్ దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను తగ్గించడం, స్థిరమైన ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడం వంటి సూత్రాలను ప్రజలకు తెలియజేయడానికి బీఈఈ చర్యలు తీసుకుంటోంది.
విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ, వ్యర్థాల తగ్గింపు, ఇ–వ్యర్థాల నియంత్రణ వంటి ఏడు కీలక విభాగాలలో 75 కార్యాచరణ దశలు మిషన్ లైఫ్‌లో ఉన్నాయి. 2028 నాటికి 100 కోట్ల మంది భారతీయులు, ప్రపంచ పౌరులను ఈ యజ్ఞంలో నిమగ్నం చేయాలనే మిషన్ లైఫ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో బీఈఈ కీలకపాత్ర పోషించనుంది.
ప్రతి రోజూ 50 వేల నుంచి 1 లక్ష మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఇది విభిన్న సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. యాత్రికులు, నివాసితులు తమ దైనందిన జీవితంలో ఇంధన–పొదుపు ప్రవర్తనలను స్వీకరించాలి.
ఎల్‌ఈడీ లైటింగ్‌కి మారడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని సంరక్షించడం వంటి విధానాలను పాటించే విధంగా ప్రజలను బీఈఈ ప్రోత్సహిస్తుంది. ఈ ప్రయత్నాలు భారతదేశ శక్తి వినియోగం, పర్యావరణ పరిరక్షణపై గణనీయంగా ప్రభావం చూపగలవని నిరూపించాలని బీఈఈ భావిస్తోంది. భవిష్యత్ చర్యలకు పునాది వేస్తున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 వంటి చురుకైన విధానాలతో ఆంధ్రప్రదేశ్ చాలా కాలంగా ఇంధన సామర్థ్యం, స్థిరమైన అభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. తిరుపతిలో బీఈఈ చేపట్టే మిషన్ లైఫ్ అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళతాయి.
వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణతకు వ్యతిరేకంగా ఏకీకృత పోరాటాన్ని ప్రోత్సహిస్తాయి. మిషన్ లైఫ్ కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం), స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి బీఈఈ పని చేస్తుంది.
తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ స్పృహను పెంపొందించడంలో పణ్య క్షేత్రాలు ఉపయోగపడతాయని చాటి చెప్పేలా బీఈఈ చర్యలు తీసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తీర్థయాత్ర కేంద్రాలకు గ్లోబల్ మోడల్‌గా తిరుపతిని మార్చనుంది. ఇక్కడ పర్యావరణ నిర్వహణను ప్రోత్సహించడానికి బీఈఈ చర్యలు చేపట్టనుంది.
2022–23 నుంచి 2027–28 వరకూ లో 1 బిలియన్ భారతీయుల వ్యాపార–సాధారణ జీవన విధానంపై మిషన్ లైఫ్ ప్రభావం ఈ క్రింది విధంగా ఉంటుందని అంచనా.