ప్రజా వైద్యానికి పెద్ద పీట

-ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు
-సీహెచ్‌సీ లో సమస్యలు పరిష్కరిస్తాం
-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

కోవూరు, మహానాడు: కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో దొడ్ల రుక్మిణమ్మ – వరదా రెడ్డి, దొడ్ల పార్ధసారధి రెడ్డి – లలితమ్మ ట్రస్ట్ తరఫున అందించిన అత్యాధునిక CTG మెషిన్ (కార్డియో టోకో గ్రఫీ), దొడ్ల కోదండరామిరెడ్డి సమకూర్చిన ఫిజియోధెరఫి సైకిల్, బెడ్ స్కీన్స్ లను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించారు. ల్యాబ్‌లు, ఆసుపత్రిలో వసతులపై ఆరా తీశారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించామని, పలు సమస్యలను వైద్యాధికారి ప్రభావతి తన దృష్టికి తెచ్చారన్నారు. రోజుకు దాదాపు 250 నుంచి 300 మంది అవుట్ పేషంట్లకు సేవలందించే ఈ ఆసుపత్రిలో మౌలిక వసతుల కొరత ఉందన్నారు. చిన్న పిల్లల డాక్టర్ పోస్ట్, స్టాఫ్ నర్సు, హెడ్ నర్సు పోస్టులు వీలైనంత త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాన్పుల వార్డులో ఏ.సి అవసరం ఉందని, అలాగే పోస్ట్ మార్టం రూమ్ సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. కరెంట్‌ పోయిన సందర్భాల్లో రోగులకు వైద్యం చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఇన్వర్టర్ గాని, జనరేటర్ గానీ ఇక్కడ అవసరం ఉందన్నారు. అవి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆసుపత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉండాలని, ఎక్కడా అపరిశుభ్రత అనేది లేకుండా పనిచేయాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.

కార్యక్రమంలో బుచ్చి కమిషనర్‌ రమణ బాబు, టీడీపీ బుచ్చి టౌన్‌ అధ్యక్షులు ఎంవీ శేషయ్య, రూరల్‌ అధ్యక్షులు బత్తల హరికృష్ణ, దాత దొడ్ల కోదండరామిరెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి, వైద్యాధికారి పద్మావతి, ముఖ్య నాయకులు ఎర్రంరెడ్డి గోవర్థన్‌రెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, జనసేన నాయకులు మాధవ్‌, బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు, బెజవాడ వంశీధర్‌రెడ్డి, చప్పిడి శ్రీనివాసులు, కౌన్సిలర్‌ తాళ్ళ వైష్ణవి, జూగుంట పురుషోత్తం, హరినాథ్‌, కిషోర్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.