ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు

-ఒక్కోపార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో 100 పార్కులు ఏర్పాటు లక్ష్యం
-విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలి
-ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం
-పరిశ్రమలు, ఎంఎస్ఎఈ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి : రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నందుకు వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామికాభివృద్ధి పార్కుల్లో ఎన్ని అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్న వాటిపై పరిశీలన చేయాలని చెప్పారు.

రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఏరియా ఆధారిత ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఇ శాఖలపై సచివాలయంలో సీఎం మంగళవారం సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నపారిశ్రామికాభివృద్ధి పార్కులు, కొత్తగా ఏర్పాటు కానున్న ఓడరేవులపై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సియంకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ఎక్కువ అవకాశాలను ఉన్నాయని అన్నారు. కావున వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 100 పార్కులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర అత్యధిక ఇండస్ట్రియల్ పార్కులను కలిగి దేశంలో అగ్రస్థానంలో ఉందని, మన రాష్ట్రంలో ప్రస్తుతం 53 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని రానున్న రోజుల్లో మరిన్ని పార్కులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను పోత్సహించాలన్నారు.

రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల అభివృద్ధికి తగిన మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న ఉత్తమ పోర్టులపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. దేశంలో రెండవ అతిపెద్ద సముద్రతీర ప్రాంతాన్నికలిగి ఉన్నందున ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు మరిన్ని పోర్టులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

లాజిస్టిక్ పరమైన రోడ్లు, రైల్ కనెక్టివిటీతో పాటు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంత హింటర్ ల్యాండ్ అనుసంధానంతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల నిర్మాణం జరగినప్పుడే ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని చెప్పారు. ఆదిశగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ పోర్టుల ఏర్పాటుకై మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, సీయం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమీషనర్ సిహెచ్.శ్రీధర్, ఎపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.