– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి
గుంటూరు, మహానాడు: దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన పీవీజీ రాజు శత జయంతి సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిసి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఆహ్వాన పత్రాన్ని అందించారు.
ఆంధ్రప్రదేశ్ లో విజయనగర మహారాజుగా పనిచేసిన సోషలిస్ట్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా, శాసన సభ్యుడిగా, లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా కృషిచేసి ఉత్తర కోస్తా ప్రజలకు తమ భూములను, ప్యాలెస్ లను, కోటలను దానం చేసిన మహనీయులు పీవీజీ రాజు శతజయంతి సభను అక్టోబర్ చివరి వారంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. పీవీజీ రాజు శత జయంతి సభకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పీవీజీ రాజు జీవిత విశేషాలతో కూడిన పుస్తకాన్ని లక్ష్మణ రెడ్డి బహూకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ గుంటూరులో జరిగే శతజయంతి సభలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించడానికి అంగీకరించారన్నారు.
నేటి యువతకు రాజు చేసిన త్యాగాలు, విద్యాభివృద్ధికి చేసిన కృషి, సింహాచలం దేవస్థానం ప్రగతికి అందించిన తోడ్పాటును, అవినీతి రహితంగా, నిస్వార్ధంగా, నిరాడంబరంగా చేసిన రాజకీయ కార్యక్రమాలను గూర్చి తెలియజేయవలసిన బాధ్యతలు గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు లక్ష్మణ రెడ్డి, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి పి. రామచంద్ర రాజు తెలిపారు.