అదే మన రాష్ట్రం లో అయితేనా!?

(భోగాది వేంకట రాయుడు )

దేశాధ్యక్ష పదవికి అమెరికాలో రేపు నవంబర్ లో జరగనున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ పై హత్యా ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఎవడో క్రూక్స్ అనేవాడు ట్రంప్ పై తుపాకీ ఎక్కిపెట్టి టప టపా బుల్లెట్లు పేల్చాడు. వాడొకటి తలిస్తే, దేవుడు ఒకటి తలి చాడు. (మన జ’గన్’, ఆయన మంత్రులు, ఎంఎల్ఏ లు, వారి రౌడీ మూకలు, రౌడీ పోలీసులు, రౌడీ ఐపీ ఎస్ లు, నిలువు దోపిడీ ఐఏఎస్ లు, కొండమీద ధర్మారెడ్డి మొదలైన ‘దండు పాళ్యం’ బ్యాచ్… ఎన్నికల ఫలితం పై ఒకటి తలిస్తే, దేవుడు మరొకటి తలచినట్టు అన్న మాట.

అలాగే, 2003 అక్టోబర్ 1 వ తేదీన చంద్రబాబు నాయుడు లక్ష్యం గా అలిపిరి లో నక్సలైట్లు అమర్చిన మందు పాతర్లు పేలిన సంగతి తెలుసు కదా! అప్పుడు నక్సలైట్లు ఒకటి తలిస్తే, కొండమీద ఉన్న దేవుడు మరొకటి తలిచాడు కదా! చంద్రబాబు ఆ దాడి నుంచి సురక్షితం గా బయట పడ్డారు. ‘ఉండి’ఎంఎల్ఏ రఘురామ రాజు ను చంపేయాలని 2021 లోనే అప్పటి పాలక పెద్దలు తలిస్తే, దేవుడు మరొకటి తలిచాడు కదా! ఆయన వారికి చుక్కలు చూపిస్తున్నారు.

సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించాలని అప్పటి ఓ తుప్పుపట్టిన గన్ ఒకటి తలిస్తే, అదేం కుదరదు అంటూ దేవుడుమరొకటి తలిచాడు కదా! అలాగే, సస్పెన్షన్ లోనే ఆయనను రిటైర్ చేయించాలని ఆ తుప్పు పట్టిన గన్ తలిస్తే, – “అదేం కుదరదు రా అబ్బాయ్…!సగౌరవంగా రిటైర్ అవ్వాల్సిందే ” అని దేవుడు మరొకటి తలిచాడు కదా! మనం ఒకటి తలిస్తే, దేవుడు ఇంకోటి తలుస్తాడు అంటే ఇదే.అలాగన్న మాట.

అలాగే, ఈ మెంటల్లీ ‘క్రాక్’ అయిన క్రూక్ గాడు ఒకటి తలిస్తే, దేవుడు ఇంకోటి తలిచాడు. దానితో, ట్రంప్ బుర్రకు నేరుగా తగలాల్సిన ఆ బుల్లెట్….; ఆయన చెవి పక్క నుంచి దూసుకుపోయింది. ఆ బుల్లెట్ వేగానికి, శబ్దానికి ట్రంప్ చెవి నుంచి కొద్దిగా రక్తం బయటకు కారింది. ఆయనకు ఏమీ కాలేదు.

ఆయనను రక్షణగా సదా వెన్నంటి ఉండే “సీక్రెట్ ఏజెంట్స్ ” మాత్రం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా…. క్రూక్స్ ను అక్కడికక్కడే… స్పాట్ లో కాల్చి చంపేశారు.

ఒక వేళ, ఇటువంటి సంఘటన మన రాష్ట్రం లో జరిగి ఉంటే.(ఎన్నికలకు ముందు…)

ఆంధ్రా ట్రంప్ పై ఎవరైనా ఇలాటి ఆకతాయి ఏ మామిడి టెంకో విసిరి ఉంటే ; మన పోలీసులు కూడా స్పాట్ లో రియాక్ట్ అయ్యి, ఆ ఆకతాయిని ఎత్తుకు పోయి ఉండే వారు. ఎక్కడో ఓ ఏసీ గదిలో పెట్టి, బిర్యానీ పెట్టించి…, ఇంటరాగేషన్ మొదలు పెట్టే వారు.

“నీ పేరేంట్రా …?”
” ఎంకట్రావ్ అండి… ఎంకులు అంటారు… ”
” ఎంకట్రావు కాదురా! ఎంకట్రావు చౌదరి అనాలి .ఎవరడిగినా ఎంకట్రావ్ చౌదరి అని చెప్పాలి. తెలిసిందా?”
” నా పేరు అది కాదు కదండీ… ”
” తెల్సులేరా…. మేమేమన్నా ఎర్రి నాకొడుకుల్లా కనపడుతున్నామా? నీ మీద కేసు లేకుండా చెయ్యటానికేరా ఇదంతా….! రేపు కోర్టు కు తీసుకెడతాం . మేస్ట్రీటు కు చెప్పాలి. సరేనా!”
ఈ పని ఎవడు చెయ్యమన్నాడ్రా! నీ ఎనకాల ఎవరెవరు ఉన్నార్రా? ”
” ఎవ్వరు లేరండి. నేనే…. నండి… మావిడికాయ అప్పుడే తిన్నానండి. చేతిలో టెంక ఉందండి. అప్పుడే అటో ఊరేగింపు వస్తంటే…., సరదా గా ఇసిరానండి. అది ఎవరికి తగిలిందో కూడా సూళ్ళేదండి…”
” ముయ్ బే ముయ్…. అట్టా చెబితే మేష్ట్రీట్ నీకు రేపే ఊరిశిక్ష ఏస్తాడు. చంద్రబాబు, లోకేష్ పేర్లు చెప్పు, నీ ఎనకాల ఎవరున్నారని ఎవరడిగినా సరే వాళ్ళ పేర్లే చెప్పాలి నువ్వు సేఫయ్యిపోతావ్ …. అప్పుడు కేస్ నీ మీదుండదు. నీకు ఓ రెండు లక్షలు ఇస్తాం. చక్కా జిరాక్స్ సెంటర్ పెట్టుకుందువు గానీ…. ”
” నా ఎనకాల ఆళ్ళు లేరు కదండీ. అసలాళ్ళ మొహాలు కూడా నేను చూళ్ళేదు కదండీ….!”
” ఈడితో ఇట్టా లాభం లేదు కానీ, ఈణ్ణి లోపలకేసుకుపోయి కుమ్మేయండి నా కొడుకుని… ”
ట్రింగ్… ట్రింగ్…. ట్రింగ్….
” ఎస్ పీ గారు సర్… ”

” ఈడొకడు. అరగంటకోసారి దొబ్బేస్తాడు” అని గొణుక్కుని; “నమస్కారం సర్. ఎంత ట్రయ్ చేసినా వాళ్ళ పేర్లు చెప్పడం లేద్సర్…. ఇప్పుడే ఆణ్ణి లోపలకు పంపించా సర్. ఇప్పుడే మనోళ్లు బిగిన్ చేశార్సర్. ఇంకో గంటకు చెప్పొచ్చు సర్… ఆ పని మీదే ఉన్నాం సర్…

” గుడ్… ట్రయ్ చేయండి. ఇప్పటికి పై నుంచి మూడు సార్లు అడిగారు, చెప్పాడా అని… ”
“యస్సర్… ఈ నైట్ కి చెప్పిస్తాం సర్. తవరు రెస్ట్ తీసుకోండ్సర్….”
“ఐ నో… ఐ నో…! ఆళ్ళిద్దరి పేర్లు చెప్పక పోతే, ఓ పని చెయ్… ఆడు తెలుగు దేశం మెంబెర్ అని చెప్పించు…. అప్పుడు తెలుగుదేశం లో ఓ ఇద్దరి ముగ్గుర్ని ఎత్తేద్దాం. లేకపోతే మనం అయిపోతాం…”
“యస్సర్. నాకొదిలేయండి సర్.గుడ్ నైట్ సర్. అమ్మగారికి నమస్కారాలు సర్….”
ఎంకట్రావ్ విసిరింది రాయో…. రప్పో తెలియక… రాష్ట్ర ప్రజలు, రాజకీయ వర్గాల వారు, మీడియా జనం ఒహటే ఇదై పోయారు. పోలీస్ శాఖ కూడా మీడియా కు ఏమీ చెప్పలేదు. కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు.
మరుసటి రోజు కొన్ని పత్రికల్లో…..
మన నేత పై టీడీపీ హత్యా ప్రయత్నం….
చంద్రబాబు, లోకేష్ పై అనుమానాలు….
నేతకు తృటి లో తప్పిన ప్రాణ గండం…..
బొట బొటా నేల రాలిన రెండు రక్తపు చుక్కలు….
బ్యాండేజ్ పట్టీ వేస్తే చాలన్న వైద్యులు….
అదేమి సలహా అని విస్తు పోతున్న న్యాయ నిపుణులు…
ఆ ఆయుధం సైతం మాయం….
దీని వెనుకా బాబు పకడ్బందీ వ్యూహం….
దర్యాప్తు కు 12 పోలీస్ బృందాలు…..
ముందస్తు బెయిల్ ఆలోచనలో బాబు, చిన బాబు….
రాకపోవచ్చునని న్యాయ నిపుణుల అంచనా…
ఇలా సాగేది మన ‘దర్యాప్తు’.
ప్రభుత్వం-ఒక వ్యవస్థ.
రాజకీయాలు- ఒక వ్యవస్థ….
పోలీసు యంత్రాంగం- ఒక వ్యవస్థ….
మీడియా – ఒక వ్యవస్థ…

అన్ని వ్యవస్థలూ కట్టగట్టుకుని దిగజారిపోయిన ఓ బ్రష్ట సమాజం లో మనం జీవిస్తున్నాం గనుకనే…. ఇలా బతుకుతున్నాం. ఈ బ్రష్ట సమాజం…. ఇక్కడి నుంచి ఇంకెక్కడకి ప్రయాణిస్తుందో చూడాలి.