– విలేఖర్ల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేల సూటిప్రశ్న
విజయవాడ: కూటమి ప్రభుత్వం వరద బాధితులకు, రైతులకు పరిహారాన్ని శరవేగంతో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చేసిందని, పరిహారంపై వైఎస్సార్‌సీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని, జగన్‌లా ఉత్తుత్తి బటన్ నొక్కలేదని విజయవాడ ఆటోనగర్‌లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, గద్దె రామమోహన్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు అన్నారు. వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గతంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం తరపున ఇచ్చే సాయం బాధితులకు అందడానికి నెలల తరబడి సమయం పట్టేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో వరద బాధితులకు శరవేగంగా పరిహారం అందిందని గుర్తు చేశారు.
బుడమేరు వరదలకు కారణం జగన్ మోహన్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పరిహారానికి బాధితులంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే జగన్‌రెడ్డి మాత్రమే కుట్ర రాజకీయాలకు తెరలేపుతుందన్నారు. విజయవాడకు వరదలు వచ్చింది ఆగస్టు 30, పరిహారం సెప్టెంబర్ 17న.. 98శాతం అంటే 2,72,000 కుటుంబాలకు పరిహారం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. వర్షాలకు రాష్ట్రంలో 6,800 కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం జరిగిందని, చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లకుండా 11రోజుల పాటు కలెక్టరేట్‌లోనే ఉంటూ ప్రతి ఒక్కరికీ సాయమందేలా చూశారని కొనియాడారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కృష్ణానదికి 8సార్లు వరద వచ్చింది, ఆ రోజు సీఎంగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఒక్కసారిగా కూడా వచ్చి పరామర్శించలేదు, అంతేకాదు నష్టపోయిన ఏ వ్యక్తికి డబ్బులిచ్చే కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తు ఊహించేలా ఉండదు… ఒక్క రాత్రి కురిసిన వర్షంతోనే నాడు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. గతంలో కూడా హుదూద్ తుపాను సందర్భంగా చంద్రబాబు విశాఖ వెళ్లి బస్సులో అక్కడే వుండి పూర్వస్థితికి తెచ్చారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నేను వరదల్లో ఫుడ్ కమిటీ మెంబర్‌గా ఉన్నాను.. వరద ప్రభావిత కుటుంబాలకు సాయం చేయడానికి దాతలు ముందుకొచ్చారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డితో సహా వైఎస్సార్‌సీపీ తరపున పోటీచేసిన ఏ ఒక్కరూ సాయం చేయడానికి ముందుకు రాని పరిస్థితి. మీ సాక్షి పత్రికలో అధికార పక్షం బాగా చేసిందని రాయలేకే ఇలా ముంపులో 534 కోట్లు బొక్కేశారని రాసి ప్రజల్ని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు.