రాజమండ్రి నెక్స్ట్‌ లెవెల్‌ అంటే ఇదేనా?

– అరగంట వర్షానికే నగరం జలమయం
` కమీషన్ల కోసం నాశనం చేశారు
– భరత్‌పై కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ధ్వజం

రాజమహేంద్రవరం: కమీషన్ల కోసం మార్గాని భరత్‌ రామ్‌ రాజమండ్రి నగరాన్ని నాశనం చేశారని సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మండిపడ్డారు. తిలక్‌ రోడ్డులోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భరత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భరత్‌ రామ్‌ చేసిన అభివృద్ధి చూసి జబర్దస్త్‌ కమెడియన్లు కామెడీ చేస్తున్నారన్నారు. ఎండా కాలంలో కురిసిన అరగంట వర్షానికే నగరం జలదిగ్బంధం అయిందని, నెక్స్ట్‌ లెవెల్‌ అంటే ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోవడమేనా అంటూ ఎద్దేవా చేశారు. భరత్‌రామ్‌ 25 శాతం కమీషన్‌ కారణంగా నగరం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకిరామయ్య, ఉమా మార్కండేయస్వామి ఆలయం మాజీ చైర్మన్‌ ఇన్నమూరి దీపు, నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, కనకాల రాజా, ముసిని బాబురావు తదితరులు పాల్గొన్నారు.