ఇస్కాన్ కృషి ప్రశంసనీయం

– దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ : ప్రజల్లో ధార్మిక చింతన, మానవతావాదాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇస్కాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో ఇస్కాన్ ప్రతినిధులు మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాన్ని, కృష్ణుడు, పూరి జగన్నాథుని చిత్రపటాలను, ప్రసాదాలను మంత్రికి అందించి, ఆశీర్వచనాలిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మిక భావననను పెంపొందించేందుకు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన కార్యక్రమాలను చేపడుతున్నదని అన్నారు. భగవద్గీత, కృష్ణ తత్వాలను ప్రచారం చేస్తూ, ప్రకృతి పట్ల ఆరాధనా భావం, సాత్విక జీవనశైలితో జీవితంలో కలిగే గొప్ప మార్పు పై అవగాహన కల్పిస్తూ మానవ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే దిశగా ఇస్కాన్ చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి అన్నారు.