జగన్‌కు కడప జడ్పీ కుర్చీ జంజాటం

కడప జిల్లాలో వైసీపీ అలర్ట్
జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు
జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు..
ప్రత్యేకంగా సమావేశం కానున్న వైఎస్ జగన్
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా వైసీపీ కసరత్తు

(రమణ)

కడప: ప్రభుత్వం మారిన తర్వాత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు.. అధికార టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు.. ఇప్పటికే పలు మున్సిపాల్టీలను తమ ఖాతాలో వేసుకుంది తెలుగుదేశం పార్టీ.. అయితే, కడప జిల్లాలో వైసీపీ అలర్ట్ అయ్యింది. ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది.

జిల్లాలోని జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు వెళ్లాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా వైసీపీ కసరత్తు ప్రారంభించింది.

కాగా, కడప జిల్లాలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో రెండు ఖాళీగా ఉన్నాయి. 48 జడ్పీటీసీ సభ్యులలో ఒక గోపవరం మినహా అందరూ వైసీపీ జడ్పీటీసీలే. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఐదుగురు జడ్పీటీసీలు, మరో జడ్పీటీసీ బీజేపీ గూటికి చేరారు.

ఈ నేపథ్యంలో.. మరింత మంది జడ్పీటీసీలు చేజారకుండా కడప జెడ్పీ చైర్మన్‌ పదవి కూడా దూరంగా కాకుండా వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అందులో భాగంగా అందరినీ విజయవాడకు రమ్మని పిలుపునిచ్చారు. ఇక, విజయవాడలో జడ్పీటీసీలతో వేర్వేరుగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అవుతారని తెలుస్తోంది.