టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాం

– సుమారు రూ.700 కోట్ల టీడీఆర్ బాండ్ల అవినీతి
– జగనే ప్రధాన సూత్రదారి
– సిఐడి విచారణ జరుగుతుంది
– మాజీ మంత్రి కారుమూరి, బాధ్యలైన అధికారులకు శిక్ష తప్పదు
– ఎమ్మెల్సీ దువ్వాడ రాజీనామా చేస్తారా? జగనే సాగనంపుతారా?
– అగ్రిగోల్డ్ ఆస్తుల మేతలో మాజీమంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఎ2.
– వైసీపీలో చాలామంది 420 లు ఉన్నారు
– నాడు శాసనమండలి వద్దన్న జగన్ బొత్సాను మండలికి ఎలా పంపిస్తారు?
– రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం : వైసీపీ పాలనలో రూ.700‌కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు సూత్రధారి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ఆరోపించారు. ఈ స్కాంలో విషయంలో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలకపాత్ర పోషించినప్పటికి తెరవెనుక అసలుకథనడిపింది జగనే అనేది వాస్తవమన్నారు. టీడీఆర్ బాండ్ల స్కాంపై సీఐడి విచారణ జరుగుతుందని, అధికారులతోసహా దీనికి బాధ్యులైన వైసిపి వారందరికి శిక్ష తప్పదని అన్నారు.

మంగళవారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల దోషులను తమ ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు కుటుంబం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి గౌరవంగా అతనితో రాజీనామా చేయించి ఇంటికి పంపాలని సూచించారు.

పెద్దల సభలో ఉన్నవారే ఈ మధ్య కాలంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, రేపు పెద్దలసభలోకి దువ్వాడ శ్రీనివాస్ ఏ ముఖం పెట్టుకొని వచ్చి సమాధానం చెబుతానని ప్రశ్నించారు. అసలు దువ్వాడ కాని, జగన్ కాని సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిలదీశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ వైసీపీకి సమాధి కట్టారని, ఇప్పుడు దువ్వాడ వ్యవహారంతో ఆ పార్టీ ప్రజల్లో మరింత దిగజారిందన్నారు. ఆనాడు శాసనమండలి వద్దని రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు బొత్స సత్యనారాయణను శాసనమండలి ఎన్నికల్లో పోటీకి ఎలా నిలబెడుతున్నారని ప్రశ్నించారు.

పెద్దలసభకు ఇలాంటివారంతా అవసరమా అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాహా చేసిన కేసులో మాజీమంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఎ2 అని, అగ్రిగోల్డ్ ఆస్తులు పందికొక్కుల్లా మేసేశారని మండిపడ్డారు. నాటి జగన్ పాలనలో మంత్రులంతా ఇలాంటి వారేనని, ఒకమంత్రి‌గంటా అరగంటా అని అసభ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. వైసీపీ వారిలో చాలామంది 420 లని ఆరోపించారు. వారంతా చేసిన అవినీతి ఒకటొకటిగా బయటకు వస్తున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు.

నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనేనానుడి వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి అక్షరాల సరిపోతుందన్నారు. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా కట్టబెట్టాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాయడం హాస్యాస్పదమని విమర్శించారు. ఆ లేఖలో తన రాజకీయ అజ్ఞానాన్ని జగన్ ప్రదర్శించారని, ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే 10 శాతం సీట్లు పొందాలన్న నిబంధన ఎక్కడా లేదు కదాఅని స్పీకర్ ను ప్రశ్నించడం విడ్డూరమన్నారు.

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు. పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు.. వైసీపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అవగాహన లేక ఈ ఆసుపత్రిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. టీబీ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామని,బేబీ కిట్లు మళ్ళీ ఇస్తామని చెప్పారు. నెలకో,పదిహేను రోజులకొకసారి ఆసుపత్రిని సందర్శించాలనుకంటే వారానికి ఒకసారి రమ్మని రోగులు అడుగుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు.

ఆసుపత్రి కమిటీ వేస్తున్నామని, గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కమిటీ సమావేశానికి ఆహ్వానించేవారుకాదని తెలిపారు. సదరన్ సర్టిఫికేట్ల విషయంలో కలెక్టర్ శ్రద్ధ తీసుకుని వారికి న్యాయం చేస్తున్నారని అన్నారు. వారందరికీ రూ.15 వేలు పెన్షన్ వచ్చేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేటు అంబులెన్స్ అడిగేవారి సంగతి తేల్చుతానని హెచ్చరించారు. కిడ్నీ బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

రుడాలో జరిగిన అవకతవకల గురించే కాదు,ఎక్కడ తప్పు జరిగినా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. నామవరంలో 1200 గృహాలు త్వరలో ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారని తెలిపారు. జనప్రియ లే అవుట్ లో ప్రీ హోల్డ్ పేరుతో భూములను దోచేశారుని ఆరోపించారు. ఇకవారి దందాలు సాగనివ్వకుండా చూస్తామని హెచ్చరించారు.

అనంతరం ఆయన ఆసుపత్రికి వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, మజ్జి రాంబాబు, కొయ్యల రమణ, కడలి రామకృష్ణ, కొత్తల వీర వెంకట రామ కిషోర్, హరి బెనర్జీ, సలాది ఆనంద్, పొలకి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.