అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
అమరావతి, మహానాడు : దాడులు, దౌర్జన్యాల గూర్చి మాట్లాడే అర్హత జగన్లే కు లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. జగన్ ఐదేళ్ళ పాలనలో ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం, మాకు ఊపిరి ఆడటం లేదు’ అనే నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశామన్నారు. గొంతులు మూగబోయోలా, నరాలు తెగిపడేలా అరచి, అరచి దళితుల చావుల గూర్చి మాట్లాడామన్నారు. దాడులు, దౌర్జన్యాలు జరిగాయంటూ జగన్ ఢిల్లీలో నిరసన చేపట్టి, ఫోటో గ్యాలరీ ఏర్పాటుపై బాలకోటయ్య విమర్శించారు.
డిల్లీలో ఏర్పాటు చేసిన జగన్ గ్యాలరీలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, చీరాల కిరణ్ బాబు, అబ్దుల్ సలాం, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి పోటోలను కూడా గ్యాలరీలో ఏర్పాటు చేయాలని జగన్ కు సూచించారు. వంద ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీ యాత్రకు బయలు దేరినట్లు ఐదేళ్ళ వైకాపా పాలనలో దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలకు రాష్ట్రాన్ని చిరునామాగా మార్చారన్నారు. జగన్ కు డిల్లీలో దాడులు, దౌర్జన్యాల గూర్చి మాట్లాడే అర్హత లేదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య దేవుడికి తెలుసు అన్న జగన్మోహన్ రెడ్డి కి 50 రోజుల్లో ఏపీలో శాంతి భద్రతలు క్షీణించయని, ఢిల్లీ వెళ్ళమని ఎవరు చెప్పారో తెలపారన్నారు. పదకొండు సీట్లతో ఏపీలో ముఖం చెల్లక ఢిల్లీ వెళ్ళారని చెప్పారు. ఏ రాష్ట్రానికైనా శాంతి భద్రతలు ముఖ్యమని, గత ఐదేళ్ళ శాంతి భద్రతలపై కూటమి ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటే, మళ్ళీ అలాంటి ఘటనలు జరగవని తెలిపారు. రోగం సరే, వైద్యం మాటేమిటి? అన్నదే ముఖ్యమని, వైద్యం చేయకుండా రోగం గూర్చి మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలతో ఐదేళ్ళ దాష్టీకాలపై చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.