Mahanaadu-Logo-PNG-Large

జగన్.. విజయమ్మ కలిశారు!

లండన్ నుంచి నేరుగా జగన్ ఇంటికి
– షర్మిలతో కలసి హైదరాబాద్‌కు
– జూన్ 1న లండన్ నుంచి హైదరాబాద్‌కు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంతైనా కన్న కొడుకు. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కొడుకు కాకుండా పోతాడా? ఆయనకు ఆమె తల్లి కాకుండా పోతుందా? కూతురుని గెలిపించమని, కొడుకు గురించి ఒక్క ముక్క కూడా చెప్పని తల్లి విజయలక్ష్మి.. చివరాఖరకు కొడుకు జగన్ ఇంటికే చేరారు.

ఎన్నికల ముందు లండన్ వెళ్లిన విజయమ్మ, అక్కడ షర్మిల కొడుకు రాజారెడ్డి దగ్గర ఉన్నారు. ఎన్నికల తర్వాత షర్మిల కూడా లండన్ వెళ్లారు. జూన్ 1న షర్మిలతో కలసి హైదరాబాద్ వచ్చిన విజయమ్మ, కొడుకు జగన్ ఇంటికి చేరినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో తన కూతురు షర్మిలను గెలిపించాలని వీడియో ద్వారా కోరిన విజయమ్మ.. పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న కొడుకు జగన్‌ను గెలిపించమని మాత్రం కోరకపోవడం అప్పట్లో చర్చనీయాంశమయింది.

అయితే జగన్ పై కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు, వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ క్రమంలో జోక్యం చేసుకున్న విజయమ్మ.. కొడుకుపై తోటికోడలు సౌభాగ్యమ్మను పోటీకి దింపవద్దని షర్మిలకు నచ్చచెప్పి, ఆమెను బరి నుంచి తప్పించడంలో మాత్రం, విజయమ్మ సక్సెస్ అయ్యారని వైసీపీ వర్గాల్లో అప్పట్లో చర్చ జరిగిన విషయం తె లిసిందే. ఇప్పుడు ఓడిపోయిన జగన్ వద్దకు వెళ్లిన విజయమ్మ, ఆయనను ఓదార్చినట్లు చెబుతున్నారు. ఎంతైనా పేగుబంధం కదా మరి?