బెజవాడలో జగన్ బురద రాజకీయం!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

విజయవాడ, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి లండన్‌ పారిపోయే దారిలేక వరదల్లో విలవిల్లాడుతున్న బెజవాడ నగరంలో బురద రాజకీయం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నాయకుడంటే ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి… ఆ స్ఫూర్తి ని కూడా మరిచిపోయి లండన్ విహార యాత్రకు ఏర్పాట్లు చేసుకున్న వ్యక్తి జగన్ అని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. కోర్టు కేసుల కారణంగా పాస్‌పోర్ట్ సీజ్ అయి ఆ పర్యటనకు వీలు కాకపోవడంతో ఆ విషయం బయటకు రాకుండా విజయవాడకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పొద్దుపుచ్చుతున్న జగన్‌ను ఏం అనాలో కూడా అర్థం కావడం లేదన్నారు.

విజయవాడ వరదలు మానవ తప్పిదం అని, ప్రభుత్వం సహాయ చర్యలు సరిగా లేవంటూ జగన్, వైకాపా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు జగన్‌ రెడ్డే అని విమర్శించారు. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 2014-19 మధ్య చంద్రబాబు తలపెట్టిన, దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టుల్ని నాశనం చేయడం తప్ప జగన్ రెడ్డి చేసిందేంటని ప్రశ్నించారు.