Mahanaadu-Logo-PNG-Large

జగన్… శవ రాజకీయాలు వద్దు

-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం అనకాపల్లి వచ్చిన జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారన్నారు. రాజకీయపరమైన విమర్శలు చేశారని, కాని ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిందని స్పష్టం చేశారు.

కేజీహెచ్ దగ్గర వైసీపీ నేతలు బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, లీగల్ హెయిర్ లేకుండా చెక్కులు ఇవ్వరని వైసీపీ నేతలకు తెలియదా అని నిలదీశారు. సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి బాధితులను పరామర్శించారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల్లో భద్రత లేదని ఎన్నోసార్లు చెప్పామని గుర్తు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం భద్రత గురుంచి పట్టించుకోలేదని, ఆ ఫలితమే ఎస్సెన్షియా ప్రమాదం అన్నారు. వైసీపీ నేతలు శవ రాజకీయాల మీద పుట్టి హత్యా రాజకీయాల మీద ఎదిగారని విమర్శించారు.

బాధితులను పరామర్శించేందుకొచ్చిన జగన్ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మూలాల శవ రాజకీయాలని, తండ్రి చనిపోతే అధికారం కోసం సంతకాలు చేశారని గుర్తు చేశారు. అలాగే 2019లో ఎన్నికలలో బాబాయి శవంతో రాజకీయం చేశారన్నారు. ప్రజల నమ్మకాన్ని అపహస్యం చేస్తూ స్టేట్ డిజాస్టర్ కి చెందిన 1500 కోట్లు నిధుల్ని డైవర్ట్ చేశారని ఆరోపించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీ ఆడిట్ పై ఫోకస్ పెడుతున్నామని స్పష్టం చేశారు.

ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ అబద్ధాలు 100 సార్లు చెపితే ప్రజలు నమ్మరని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ హయాంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కంపెనీలపై దాడులకు ఉపయోగించారని ఆరోపించారు. విశాఖలో ప్రమాదాలు జరగడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణం అని తెలిపారు.

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన కంపెనీకి జగన్ వెళ్లారా అంటూ, అసలు పాలిమర్స్ కంపెనీకి కనీసం వెళ్లలేదని ఆరోపించారు. ఏదీపడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మరని జగన్ గుర్తుంచుకోవాలని, అందుకే గత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.