– ఎమ్మెల్యే జీవీ విమర్శ
ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్షలాది మందిని ముంచాలన్న కుట్ర కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ నోరు విప్పకూడదనే జగన్ ములాఖత్ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విరుచుకుపడ్డారు. ప్రజలు విపత్తులో ఉంటే సాధ్యమైన సాయం చేయాల్సింది పోయి మహా విధ్వంసానికి ప్లాన్ చేసి దొరికిపోవడంతో నిజాలు బయటపడకుండా ఉండేందుకే జగన్ పాట్లు పడుతున్నారని చురకలు వేశారు. ఈ మేరకు జీవీ బుధవారం విలేఖర్లతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీకి అంత బరువైన పడవలు ఎలా కొట్టుకు వచ్చాయి అన్న విషయంపై నిన్నటి వరకు అనుమానంగా ఉన్న సంగతులన్నీ జగన్ రెడ్డి చర్యలతో నిజం అని నిరూపణ అవుతున్నాయన్నారు. ప్రకాశం బ్యారేజీ కూల్చేసే కుట్ర వెనక ఉన్న దుష్ట చతుష్టయం మాజీ సీఎం జగన్, సజ్జల, తలశిల రఘురాం, నందిగం సురేష్ అని బలంగా చెప్పగలమన్నారు.
జైల్లో పోలీసులు గట్టిగా అడిగినా తమ పేర్లు ఎక్కడా చెప్పొద్దని సమాచారం చేరవేయడానికే ఆగమేఘాలపై జగన్ ములాఖత్‌కు పరుగులు తీశారన్నారు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకోవడానికే సిగ్గుగా అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు జీవీ. ఒకవైపు విజయవాడ నుంచి విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంటే సీఎంగా చేసిన వ్యక్తి చేయాల్సిన పనులేంటి? తనేం చేస్తున్నారు అని ప్రశ్నించారు. వైకాపా లాంటి క్రిమినల్ రాజకీయ పార్టీని, జగన్ లాంటి క్రిమినల్ రాజకీయ నాయకుడిని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.