ఐదేళ్లలో అప్పులు తప్ప ఏం చేశావు జగన్‌రెడ్డీ

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు

సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం, రుద్రవరం, తొండపి, దమ్మాలపాడు, బొల్లవరం, గొల్లపాడు, కుందూరువారిపాలెం, ముప్పాళ్ల, లంకెల కూరపాడు, పలుదేవర్లపాడు గ్రామాల్లో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యరి లావు శ్రీ కృష్ణదేవరాయలు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలోనూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, అరాచక పాలనతో 30 ఏళ్లు వెనుకబడిపోయిందన్నారు.

పాలన చేతగాని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, మరలా రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశామని, ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యాయని, వైసీపీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కట్కెనా పూర్తిచేశారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు సంబంధించిన సామాగ్రి మొత్తం తుప్పు పట్టిపోతుందన్నారు. సైకో ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని, వ్యవసాయానికి నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.