Mahanaadu-Logo-PNG-Large

కోడికత్తి కేసు డుమ్మా కోసమే వినుకొండకు?

– శుక్రవారం ఎన్‌ఐఏ వాయిదాకు వెళ్లని జగన్
– దానికి డుమ్మా కొట్టి వినుకొండకు పయనం
– జగనుకు కోర్టుల మినహాయింపుల మేళా
– సీఎంగా లేకపోయినా కోర్టుకు వెళ్లరా?
– కోర్టుల దొడ్డమనసుపై విమర్శలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్‌కు రాజకీయాల్లో పెద్దగా పూర్వానుభవం లేకపోయినా.. ‘ఇతర’ విషయాల్లో మహా ముదురన్న కితాబు ఉంది. అంటే వ్యాపారాలు, కోర్టు వ్యవహారాలూ వంటివన్నమాట. అందుకే ఆయన దేశంలోని అందరి సీఎంలకంటే ధనవంతుడయ్యారు. పదేళ్ల నుంచి విజయవంతంగా బెయిల్‌పై తిరుగుతూ, ఒక్కసారి కూడా కోర్టు విచారణకు హాజరుకాకుండా దర్జాగా ఉన్నారు. అది ఆయనపై కోర్టులకు ఉన్న దొడ్డమనసన్నది మేధావుల ఉవాచ.

ఎందుకంటే.. జగన్ వినుకొండ ఓదార్పు యాత్రకు వెళ్లిన రోజు, ఆయన ఎన్‌ఐఏ కోడికత్తి కేసు విచారణ సందర్భం. పోనీ ఆ కోర్టు ఏ హైదరాబాద్‌లోనో, ఏ ఢిల్లీలోనే లేదు. పక్కనే ఉన్న బెజవాడలోనే ఉంది. జగన్ ఉంటున్న తాడేపల్లికి ఆ కోర్టు పదినిమిషాల దూరం. అప్పుడంటే జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడు తాను రా్రష్ట్రాన్ని ఉద్ధరించే పనిలో ఉన్నందున, కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వడం కుదరదన్నారు. దయగల కోర్టు వారు కూడా దొడ్డమనుసు చూపి, జగన్‌ను చూసీచూడనట్లు వదిలేసింది. సరే.. అది జగన్‌కు ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుకోండి. అది వేరే విషయం.

బాబు సీఎంగా ఉన్నకాలంలో వ్యవస్థలను మేనేజ్‌చేయడంలో మొనగాడని విమర్శించిన జగన్.. తాను సీఎం అయిన తర్వాత అదే వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో.. ఎవరితో ఎలా మేనేజ్ చేయించాలో.. అందుకు ‘ధర్మ’రాజులను ఎలా నియమించాలన్న అంశంలో మాస్టర్‌డిగ్రీ సంపాదించారు. ‘ధర్మ’రాజులతో తిరుపతి వెంకన్న లడ్లు, ఢిల్లీకి టన్నుల కొద్దీ పంపించి లాబీయింగ్ చేయించిన జగన్ మొనగాడి బుర్రను మెచ్చుకోవలసిందే.

చివరాఖరకు తాను ఏ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబాన్ని వేధించారో, నోవాటెల్ సాక్షిగా భార్యతో సహా.. అదే ఎన్వీ రమణతో గంటన్నర సేపు భేటీ వేసిన జగన్ బుర్ర మ్యూజియంలో పెట్టాల్సిందే. ఆ భేటీ కోసం ఆయన పడ్డ కష్టం. ప్రయోగించిన ‘గంధర్వుల’ శ్రమదానం గురించి ఎంత చెప్పినా తక్కువే. మేనేజ్‌మెంట్ అనేది ఒక ఆర్టు. అంటే ఒక జడ్జిగారి ఇంట్లో పెళ్లికి వెళ్లి ఆయనకు రెండుకోట్ల ఖరీదైన వాచీని ఇచ్చేందుకు ‘ధర్మ’రాజుల ద్వారా ప్రయత్నించిన ఆ ఆర్టు ముందు ఎవరైనా దిగదుడుపే.

ఇప్పుడు ఎన్‌ఐఏ కోర్టుకు డుమ్మా కొట్టిన జగన్, వినుకొండ ఓదార్పు యాత్రకు వెళ్లారంటే.. ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. ఒకవేళ ఆబ్సెంట్ పిటిషన్ వేశారంటే, కోర్టు నిస్సహాయతను చూసి జాలిపడాల్విందే. ‘‘విజయవాడలోనే మీరు కోర్టుకు ఎందుకు హాజరుకారు? మీరిప్పుడు సీఎం కాదు. కాబట్టి అక్కడ మీరు వెలగబెట్టే రాచకార్యాలేవీ లేవు కాబట్టి, తక్షణం కోర్టుకు రండ’’ని కన్నెర్ర చేయాల్సిన కోర్టు కూడా, జగనన్నపై బోలెడంత సానుభూతి ప్రదర్శించినందుకు కోర్టుకు వేనవేల దండాలు.