ఈ విషయం షర్మిల చెప్పడం కాదు… నాకు కూడా తెలిసిన పచ్చి నిజం
నాకు అప్పుడు ఎలా సీటు ఇచ్చావు రా… సన్నాసి?
తల్లి,తండ్రి, ఇద్దరు చెల్లెళ్లను వంచించిన వాడిని ఇంకా కొంతమంది విశ్వసించడం విడ్డూరం
జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఎన్నుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను దోచుకుంటాడు
ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అక్షరాస్యులదే
సీనియర్ ఐఏఎస్ అధికారికి ఇవ్వాల్సిన టీటీడీ ఈవో పోస్ట్ ను ఐ డి ఏ ఎస్ సర్వీస్ కు చెందిన అధికారికి ఇవ్వడం ఏమిటి?
ధర్మారెడ్డి లేకపోతే తిరుమల లో భక్తులు ఇబ్బందులు పడిపోతారని ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్లుగా వైకాపా నేతల వింత ప్రచారం
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగించిన ఎన్నికల సంఘం ఎలా అంగీకరిస్తుంది?
తిరుమల శ్రీవారిని దర్శించుకునే సామాన్య, పేద భక్తుల సౌకర్యార్థం 300 రూపాయల టికెట్ల కోటా ను పెంచాలని, చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందజేశా
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే టీటీడీ ప్రక్షాళన అనంతరం, భక్తులకుఈ తీపి కబురు వినిపిస్తారనే ఆశిస్తున్నా
కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ లను బదిలీ చేయాలి
ఎన్నికల నిబంధనల ప్రకారం ఫుల్ అడిషనల్ చార్జ్ తో పనిచేస్తున్న డీజీపీ కొనసాగడానికి వీలు లేదు
నరసాపురం ఎంపీ, ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు
చార్జిషీట్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును చేర్చింది ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డేనని నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇది పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి చెబుతున్న మాట కాదని, నాకు కూడా తెలిసిన పచ్చి నిజమని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చార్జి షీట్లో చేర్చకపోతే జైలు నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేరని తెలుసుకునే , ఆయన పేరును చార్జిషీట్లో చేర్చారని తెలిపారు. తాను జైలు నుంచి బయటకు రావడం కోసమే ఉద్దేశపూర్వకంగా రాజశేఖర్ రెడ్డి పేరును చార్జిషీట్లో చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు.
సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తల్లిని, చెల్లిని వంచించిన జగన్మోహన్ రెడ్డి, మాటకు ముందు దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని అంటుంటారని, ఆ రాజశేఖర్ రెడ్డి ఆత్మను కూడా ఆయన కొడుకుగా వంచించారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చక్కగా పరిపాలిస్తున్న సమయంలో ఏదైనా తప్పు జరిగిందంటే, దానికి కారణం జగన్మోహన్ రెడ్డే నని అన్నారు. ప్రభుత్వ నుంచి లబ్ధి పొందిన వారిని భయపెట్టి అడ్డగోలుగా ఆస్తులను కూడబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనిని చెప్పారు.
ఇటువంటి కొడుకు నాకు ఎందుకు పుట్టాడని వైయస్ రాజశేఖర్ రెడ్డి బాధపడే వారని , పదవ తరగతి పరీక్షా పత్రాలను అమ్మినప్పుడే ఇంట్లో నుంచి పంపేసి ఉంటే బాగుండేదని అనేవారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తల్లిని, ఇద్దరు చెల్లెళ్లను వంచించిన ఈ దుష్ట జగన్మోహన్ రెడ్డిని ఇంకా కొంతమంది ఆయన చెప్పే మాయ మాటలను విని నమ్మడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు . కొంతమంది కుల, మరికొంతమంది మత ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి ని ఎంపిక చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
ఎవరైనా సరే… సరైన వ్యక్తిని, సమాజ హితానికి పాల్పడే వ్యక్తి ని ఎంపిక చేసుకోవాలన్న రఘురామకృష్ణంరాజు, మతాన్ని చూసి కాదని నాయకుడి అభిమాతాన్ని చూసి ఎన్నుకోవాలన్నారు . అంతేకానీ… నువ్వు పూజించే దేవుడు, అతడు పూజించే దేవుడు ఒక్కరే అయినంత మాత్రాన నాయకుడిగా ఎంపిక చేసుకోవడమన్నది కరెక్టు కాదని, అది సరైన ప్రాతిపాదిక ఎంత మాత్రం కాదన్నారు. నాయకుడిని ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానిస్తే ప్రజల ఆస్తులు స్వాహా
ఈ దిక్కుమాలిన జగన్ మోహన్ రెడ్డిని తెలివి తక్కువ తనంతో మళ్ళీ అధికారంలోకి రానిస్తే, ప్రజల ఆస్తులు స్వాహా చేస్తారని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి దరిద్రపు ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం, ఏదైనా భూ సమస్య ఎదురైనా , మూడు నెలల వ్యవధిలో సంబంధిత జిల్లా రెవెన్యూ అధికారిని సంప్రదించాలన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే, కచ్చితంగా ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సదరు జిల్లా రెవెన్యూ అధికారి తప్పక తిరస్కరిస్తారు.
అప్పుడు బాధితులు హైకోర్టును ఆశ్రయించడం మినహా మరొక మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోని ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కొంతమంది న్యాయవాదులు, సామాజిక ధర్మంగా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తూ, కోర్టును ఆశ్రయించడం జరిగిందని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. న్యాయవాదులపై అబాండాన్ని మోపుతూ, వాళ్లకు భూ వివాదాల కేసు లు లభించవని ఆదాయ మార్గాన్ని కోల్పోతామనే భయంతోనే , ఈ చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని న్యాయస్థానానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విన్నవించి, న్యాయవాదుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసిందన్నారు.
ప్రతి ఒక్కరూ దయచేసి ఈ ప్రభుత్వం కుట్రను గమనించాలని, ఈ విషయాన్ని విద్యావంతులు నలుగురికి తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆస్తి ఉంటుందని, ఆ ఆస్తి పత్రాలను ప్రభుత్వం తన వద్ద పెట్టుకోవడం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. భూముల రీ సర్వే పేరిట, జగన్మోహన్ రెడ్డి ముఖారవింద చిత్రంతో కూడిన సర్టిఫికెట్లు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూమాఫియా కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని రఘురామ కృష్ణంరాజు వివరించారు.
చట్టాలను చుట్టాలుగా చేసుకొని ఆర్థిక అరాచకానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారన్నారు. ప్రజల ఆస్తి పత్రాలతో పాటు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై కూడా తన ఫోటోలను ముద్రించుకునే పిచ్చి జగన్మోహన్ రెడ్డికి పతాకస్థాయికి చేరుకుందన్నారు. ఇటువంటి పిచ్చి ముదిరిన వ్యక్తులను రాజకీయ చిత్రపటం నుంచి ప్రజలు దూరం చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఈ తలతిక్క చట్టాన్ని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రద్దు చేయనున్నారన్నారు.
ధర్మారెడ్డి లేని తిరుమలను మూసివేస్తానని జగన్మోహన్ రెడ్డి ఏమైనా చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంటారేమో?
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఈవోగా ధర్మారెడ్డి లేకపోతే, తిరుమలను మూసివేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటారేమోనని రఘు రామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ధర్మారెడ్డి ఈవోగా లేకపోతే, తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భగవంతున్ని భక్తులకు దూరం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలను తీసుకుందని గుర్తు చేశారు. శ్రీవాణి పేరిట టికెట్లను పెంచి సామాన్య భక్తులను భగవంతుడిని దర్శించుకోకుండా , అడ్డుకునే ప్రయత్నాన్ని చేశారన్నారు.
శ్రీవాణి పేరిట ఒక్కొక్క టికెట్ ధర పదివేల రూపాయలుగా నిర్ణయించారని, ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఐదు మంది వ్యక్తులు,మొక్కు కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే 50వేల రూపాయలను ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించారు. తమ ఆస్తులను అమ్ముకోవాలా? అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టీటీడీ ప్రక్షాళనలో భాగంగా, గతంలో మాదిరిగానే సామాన్య, పేద భక్తులకు అందుబాటులో ఉండే విధంగా 300 రూపాయల దర్శనం టికెట్ల కోటాను పెంచుతూ తీపి కబురును వినిపిస్తారని రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మేరకు తెదేపా అధినేత, కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆయన రిటైర్డ్ అయ్యే వరకు పొడిగించిందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగించిన, ఎన్నికల సంఘం ఎలా అంగీకరిస్తుందని ఆయన ప్రశ్నించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కి ఇవ్వాల్సిన టీటీడీ ఈవో పోస్టును, జగన్మోహన్ రెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన ధర్మారెడ్డికి కట్టబెట్టడం దారుణమన్నారు.
డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ) విభాగానికి చెందిన ధర్మారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి మధ్యన ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఆయనకు పూర్తిస్థాయి అదనపు ఈవోగా బాధ్యతలను అప్పగించారన్నారు. ధర్మారెడ్డి తిరుమల లో భక్తులకు సౌకర్యాలు కల్పించే మాట దేవుడెరుగు, ఆయన పూర్తిగా వైకాపా తరపున ఎన్నికల సంఘం అధికారులను దారిలో పెట్టే పనుల్లో నిమగ్నమయ్యారన్నారు.
కేంద్రం పదవీ కాలాన్ని పొడిగిస్తే ఎన్నికల సంఘం అంగీకరించవద్దు
కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి పదవీ కాలాన్ని పొడిగిస్తే ఎన్నికల సంఘం అంగీకరించవద్దని రఘురామకృష్ణం రాజు కోరారు. ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోకపోతే, ఆ నింద పెను ప్రమాదాన్ని చూపెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పూర్తిస్థాయి అదనపు హోదాలో పని చేస్తున్న డిజిపి లను బదిలీ చేయడంలో ఎన్నికల సంఘం ఎందుకో ఆలస్యాన్ని చేస్తుందన్నారు.
ఎన్నికల సమయంలో పూర్తిస్థాయి అదనపు హోదాలో పనిచేస్తున్న అధికారిని నిబంధనల ప్రకారం వెంటనే బదిలీ చేయాలన్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డిజిపిని బదిలీ చేయకుండా ఉపేక్షించడం వెనుక ఎవరి ప్రభావమైన ఉందా? అంటూ ప్రశ్నించారు. నాకు నరసాపురం పార్లమెంటు స్థానం టికెట్ రాకుండా అడ్డుకున్న వ్యక్తే, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను బదిలీ చేసే అవకాశం లేదంటూ వార్తా కథనాలను రాశాయని , ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ ని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు వివరించారు.
సాక్షి దినపత్రికలో ఒక నలుగురు వ్యక్తుల గురించి రాస్తూ, అందులో నాపై ఉన్న కేసులను ప్రస్తావించడం జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపిన రాజ ద్రోహంతో పాటు, ఇతర కేసులు కాకుండా, గతంలోనూ నాపై ఆ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. మరి అప్పుడు నాకు సీటు ఎలా ఇచ్చావు రా సన్నాసి అని జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
ఇలాగే తప్పుడు ప్రచారాన్ని చేస్తే, నేను కూడా ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు, నీ తండ్రి ఏమన్నారు… నువ్వు ఎంత పనికిమాలిన పుత్రుడవో, ఇంటలిజెంట్ సుంఠ వో ప్రజలకు వివరించాల్సి వస్తుందన్నారు. అయినా సాక్షి దినపత్రికలో కట్టు కథలు రాసుకుంటే, నమ్మడానికి అంత వెర్రి వెధవలు ఎవరూ లేరన్నారు.
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదో చీఫ్ ట్రిక్కులను ప్లే చేయబోయి బోర్లా పడ్డావు. శివరామరాజును తెలుగుదేశం ముసుగులో ఇండిపెండెంట్ గా బరిలోకి దించాలన్న నీ ఎత్తుగడను ప్రజలు అప్పుడే పసిగట్టారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ చిత్రపటం నుంచి నిన్ను ప్రజలు బహిష్కరించడం ఖాయమని రఘు రామ కృష్ణంరాజు హెచ్చరించారు