శాంతిభద్రతలపై కట్టుకథలతో జగన్‌ తప్పుడు ప్రచారం

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శ

వినుకొండ, మహానాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలపై కావాలనే కట్టుకథలతో జగన్‌, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఇదే పనిగా పెట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి అయిదేళ్ల అరాచకాల రెడ్డి రక్తపుమడుగులో కూరుకుపోయిన జగన్మోహన్‌ ధర్మపన్నాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి పదేపదే జగన్, వైసీపీ, సాక్షి అడ్డగోలుగా అబద్దాలు వండి వార్చుతున్నారంటూ మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దుయ్యబట్టారు. ఇదే జగన్మోహన్‌ రెడ్డి వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యహక్కుల్ని ఎలా ఖూనీ చేశారో మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీస్‌ స్టేషన్‌లలోనే శిరోముండనాలు, మాస్క్‌ అడిగిన పాపానికి కర్కశంగా రెక్కలు విరిచికట్టడం, లాకప్‌ల్లో పెట్టి కొట్టి చంపడం.. ఇవన్నీ ఎవరు చేశారని నిలదీశారు.

సోషల్‌ మీడియాలో, ఆన్‌లైన్‌లో విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న వాళ్లను ఏం చేయాలో చెప్పాలన్నారు. రౌడీలను, తప్పుడు ప్రచారాలు చేస్తున్నా వారిని అరెస్టు చేస్తే ప్రజాస్వా మ్యం అంటూ గగ్గోలు పెడుతున్నారని, ఇదే వైకాపా ప్రభుత్వంలో జీవో-1 తో ప్రజాస్వా మ్యాన్ని హత్య చేయాలని కుట్ర పన్నింది గుర్తు లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం, ప్రజా స్వామ్యం అన్నమాటకే అర్థం లేకుండా 5 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఓపెన్‌ జైలుగా మార్చి నిరంకుశ పాలన సాగించిన నియంత జగన్ అన్నారు. దారి తప్పిన కొందరు పోలీసులు, సీఐడీని జేబు సంస్థగా వాడి తప్పుడు కేసులు, అరెస్టులతో ఎంత భయోత్పాతం సృష్టించారో కూడా ప్రజలంతా చూశారన్నారు. ఆ దారుణాలు, జగన్ తప్పుల కారణంగా నాటి డీజీపీ సహా పోలీసు బాసులు కోర్టు మెట్లెక్కడాన్నీ అంతా గమనించారన్నారు. ఆ దుర్మార్గాలను భరించలేకనే వైసీపీను ప్రజలను 11 సీట్లతో భూమిలో పాతిపెట్టారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు.