– తండ్రి పేరును నిలబెట్టే వ్యక్తి లోకేష్.. చెడగొట్టే వ్యక్తి జగన్ రెడ్డి
– మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ
విజయవాడ, మహానాడు: అసలు లేనే లేని దిశ చట్టాన్ని ప్రజలకు ఉన్నట్టు చూపుతూ మాజీ సీఎం జగన్ అసత్యాలు పలుకుతూ తండ్రి పేరును నిలబెడుతున్న మంత్రి నారా లోకేష్‌ను విమర్శించడం సిగ్గుచేటని, తండ్రి పేరు చెడగొట్టే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఇక్కడి తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బుద్ధి, జ్ఞానం, దిశ చట్టం గురించి జగన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రపంచంలోనే బుద్ధి, జ్ఞానం లేనటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. గత ఐదేళ్ల పాలనలో దిశ చట్టమనేది ఉంటే సుమారు రెండు లక్షలకు పైగా అఘాయిత్యాలు ఎందుకు జరిగాయి? ఐదేళ్ల పాలనలో దిశ చట్టం ప్రకారం ఒక్కరికైనా ఎందుకు శిక్ష వేయించలేదు? దిశ చట్టం లేదు కాబట్టే ఒక్కరికి కూడా ఆ చట్టం ప్రకారం శిక్ష పడలేదు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్టు చూపుతూ అసత్యాలు, అబద్ధాలతో పాలన సాగించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు బుద్ధి, జ్ఞానం, దిశ చట్టం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నిమ్మల దుమ్మెత్తిపోశారు.
నారా లోకేష్ నిప్పులాంటి వ్యక్తి కనుకే.. ఆయనను నిద్రలో సైతం జగన్ రెడ్డి పదే పదే కలవరిస్తున్నారు. నారా లోకేష్ స్టాన్ ఫర్డ్ వర్సిటీలో చదువుకోవడమే కాకుండా.. ప్రపంచ బ్యాంక్‍లో ఉద్యోగం చేసిన వ్యక్తి. ఐటీ మంత్రిగా తక్కువ కాలంలోనే 30 వేల ఉద్యోగాలు కల్పించడంలోనే లోకేష్ ప్రతిభ ప్రజలకు తెలిసింది. దిశ చట్టం పేరుతో జగన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టారు. విద్యా అర్హతలు కూడా చెప్పుకోలేని వ్యక్తి జగన్. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని తుప్పు జగన్ రెడ్డి. తుప్పు లాంటి వ్యక్తి నిప్పులాంటి వ్యక్తి అయినా నారా లోకేష్ ని విమర్శిస్తే ఎవరూ సహించరు.
నిజంగా దిశ చట్టమనేది వైసీపీ పాలనలో ఉంటే చర్చకు రావాలని నారా లోకేష్ సవాల్ విసిరితే తాడేపల్లి కొంపదాటి జగన్ రెడ్డి బయటకురాని పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టే గత ఐదేళ్లలో దిశ చట్టం లేదని అర్థమైంది. నారా లోకేష్ నిప్పు లాంటి వ్యక్తి కాబట్టే ఆయన పాదయాత్రకు అడ్డంకులు సృష్టించావు. జగన్ రెడ్డి తప్పు కాబట్టే పరదాలు, బారికేడ్లు, 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టు మాటున ప్రజల్లోకి వచ్చిన దుస్థితిని ప్రజలు మరచిపోలేదు. జగన్ రెడ్డి బుద్ధి, జ్ఞానం లేనటువంటి వ్యక్తి గనుకే తల్లి, చెల్లిని పీడిస్తున్నారు. జగన్ రెడ్డి సీఎం స్థానంలో ఉండడంతో లూలూ, కియో అనుబంధ పరిశ్రమలు, జాకీ, అమర్ రాజా వంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. మంత్రి నారా లోకేష్ నిప్పుగనుకే రాష్ట్రానికి మళ్లీ పరిశ్రమలను రప్పిస్తున్నారు.
నందమూరి తారకరామారావు మనవడిగా, నందమూరి బాలకృష్ణ అల్లుడిగా, సీఎం చంద్రబాబునాయుడు కొడుకుగా మాత్రమే కాకుండా స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతో ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రిగా ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థి దగ్గర నుంచి అత్యున్నతమైన బోధన చేసే ఉపాధ్యాయుల మనసులను సైతం గెలుచుకున్న వ్యక్తి నారా లోకేష్. తండ్రి పేరును నిలబెట్టే వ్యక్తి నారా లోకేష్.. తండ్రి పేరును చెడగోట్టే వ్యక్తి జగన్ రెడ్డి అని మంత్రి అన్నారు.