భారత్ లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు

– ఏపీ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డా. ఎన్. తులసీ రెడ్డి

గుంటూరు: భిన్నత్వంలో ఏకత్వం గల సమాఖ్య వ్యవస్థ కొనసాగుతున్న భారతదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, అవశ్యకత లేదని రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డా! ఎన్. తులసీ రెడ్డి పేర్కొన్నారు.

జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జమిలి ఎన్నికలు అవసరమా? సాధ్యమా? అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. డా! ఎన్.తులసీ రెడ్డి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారి తీస్తుందని, స్థానిక సమస్యల ప్రాధాన్యతలు తగ్గుతాయని, అవినీతి తారా స్థాయికి చేరుతుందని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలలో 500 లక్షల కోట్లు బడ్జెట్లలో వ్యయం చేస్తుంటే అందులో ఎన్నికల కోసం 10 వేల కోట్లు అనేది కేవలం 0.01 శాతం మాత్రమే అని తెలిపారు.

అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో అధ్యక్ష ఎన్నికలు, సెనేట్ ఎన్నికలు, ది హౌస్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎన్నికలు, గవర్నర్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు విడివిడిగా జరుగుతున్నా అభివృద్ధిలో పతాక స్థాయికి చేరిందని మోడీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఎన్నికలు విడివిడిగా జరగడం వలన అభివృద్ధికి నోచుకోలేకపోతున్నామనేది అర్థరహితం అన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఆహారం లాగా ఒకసారి ఎన్నికలనే ధోరణి అని అవహేళన చేశారు.

చట్టసభల సభ్యులే అనేక సందర్భాలలో వారి ఓట్లను సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటే గ్రామీణ ప్రాంతాలలో గల సామాన్య ఓటర్లు ఒకేసారి ఆరు ఓట్లను వేసేటప్పుడు అయోమయానికి గురవుతారని వివరించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన భద్రత సిబ్బంది, ఈవీఎంలు అందుబాటులో ఉండటం కష్టతరమవుతుందని, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలనూ ఏడు దఫాలుగా నిర్వహించిన వైనాన్ని గుర్తు చేశారు.

శాసనమండలి సభ్యులు కె. యస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ జమిలి ఎన్నికలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగంలో ప్రధానంగా ఆరు సవరణలు చేయాలని అన్నారు. జమిలి ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, బహు పార్టీ వ్యవస్థను, ఫెడరిలిజాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. 2022 లోనే జాతీయ లా కమిషన్ జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మౌళిక నిర్మాణానికి, రాజ్యాంగపాలన పద్ధతికి భంగకరం అని తెలిపిందన్నారు.

1967 వరకు దేశంలో లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయని ఆ తర్వాత సంకీర్ణ రాజకీయాలు, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ.. కోటి లోపు జనాభా ఉన్న 100 దేశాలు ప్రపంచంలో ఉన్నాయని ఇలాంటి పరిస్థితులలో అత్యధిక జనాభా గల రాష్ట్రాలు భారతదేశంలో జమిలీ ఎన్నికలు ద్వారా స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ,సిబిఐ, ఇన్కామ్ టాక్స్ వ్యవస్థల ను రాష్ట్రాలలో ప్రభుత్వ ప్రతిపక్ష నేతలపై ప్రయోగించి తమ వైపుకు తిప్పుకుంటున్నారని వివరించారు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడ గట్టడానికి ప్రజా చైతన్య సదస్సులను రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య వేదిక నిర్వహిస్తుందని ప్రకటించారు.

చర్చా గోష్టిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ప్రముఖ విద్యావేత్త మేకల రవీంద్రబాబు, రాజ్యాంగ చర్చా వేదిక కన్వీనర్ అవధానుల హరి, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ తదితరులు ప్రసంగించారు.