జనంసాక్షి రిపోర్టర్ సంతోష్ నాయక్ కు చెంప దెబ్బలు!

– చెట్టుకు కట్టేసి ప్రజాకోర్టులో శిక్షించిన ఐలాపుర్ గ్రామస్తులు
– అరాచకాలు భరించలేక ఈ చర్యని తెలిపిన బాధితులు

సంగారెడ్డి, మహానాడు: జనంసాక్షి రిపోర్టర్ సంతోష్ నాయక్ కు చెంప దెబ్బలు పడ్డాయి. అతని అరాచకాలు భరించలేక చెట్టుకు కట్టేసి ప్రజాకోర్టులో శిక్షించామని గ్రామస్తులు తెలిపారు. జర్నలిజం ముసుగులో కొంతమంది నకిలీ రిపోర్టర్ అవతారం ఎత్తి దోచుకుంటున్నారు. ఇటువంటి వారికి తగిన దేహశుద్ధి జరగాల్సిందేన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కొంత మందికి నకిలీ రిపోర్టర్లు పంచాయతీ కార్యదర్శులు, అధికారులను ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని పలువురు చెబుతున్నారు. వారికి కూడా నాయక్‌లా శిక్షించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

హైడ్రా పేరు చెప్పి ఓ వెంచర్ యజమానిని ఇద్దరు నకిలీ రిపోర్టర్లు ఫోన్‌లో బెదిరిస్తున్నారని, అలాగే, పెద్దపుర్ వెంచర్ వద్దకు వెళ్లి సెక్రటరీకి ఫోన్‌ చేసి, నువ్వు ఎక్కడా ఉన్నా రావాలని చెప్పినట్టు ఆ వెంచర్ సెక్యూరిటీ గార్డు తెలిపారు. వీరి తీసిన ఫోటోలు ఏ పత్రికలోనూ రావని, నకిలీ రిపోర్టర్లు గుంపులు గుంపులుగా వచ్చి వేధిస్తున్నారని ఐలాపుర్ గ్రామస్తులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ గ్రూప్, పటాన్ చేరు లో ఓ గ్రూప్, లింగం పల్లి లో ఓ గ్రూప్, నర్సాపూర్ లో ఓ గ్రూప్ … మొత్తం 13 మంది నకిలీ రిపోర్టర్లు ఉన్నారని, వీరంతా పోటీ పడి ఫొటోలు తీస్తుంటారని, అయితే, ఒకరో ఇద్దరివో పేపర్లలో వస్తుంటాయని, మిగతా వారివి రావని వారు చెబుతున్నారు. ఇటువంటి నకిలీ రిపోర్టర్ల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, మేమే అసలైన వాళ్ళమని తెలుపుతూ తమ పబ్బం గడుపుకొనేందుకు ‘వేషాలు’ వేస్తుంటారని తెలిపారు.

ప్రభుత్వం గుర్తింపు కార్డు పొందిన వారే నిజమైన జర్నలిస్టు గా ఉంటారని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ అంటూ కొంతమంది హంగమా చేస్తున్నారన్నారు. సంగారెడ్డి మండలం టౌన్ సదాశివపేట మున్సిపాలిటీ కొండాపూర్ కంది మండలాల్లో జర్నలిజం విలువ కాపాడే వ్యక్తులు లేకపోవడంపై వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. డీపీఆర్వో నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని ఐలాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.