Mahanaadu-Logo-PNG-Large

బాబు క్యాబినెట్‌కు జనసేన దూరం?

— విపక్ష నేతగా పవన్?
– తాను ఎమ్మెల్యేగానే జీతం తీసుకుంటానని వెల్లడి
– ఆ వ్యాఖ్యల వెనుక అంతరార్ధం అదేనా?
– మిత్రపక్షంగానే విపక్ష పాత్రకు సిద్ధం?
– బయట ఉండి బలం పెంచుకునే వ్యూహం?
– జనసేన వర్గాల్లో హాట్ టాపిక్
( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేన దళపతి పవన్ కల్యాణ్ వ్యూహం మార్చుకున్నారా? చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నారా? విపక్షనేతగా బయట ఉండి ప్రజల తరఫున ప్రశ్నించాలనుకుంటున్నారా? తాను ఎమ్మెల్యే జీతం మాత్రమే తీసుకుంటానన్న పవన్ వ్యాఖ్యల వెనుక అసలు అంతరార్ధం అదేనా?.. ఇదీ ఇప్పుడు జనసేన వర్గాల్లో హాట్‌టాపిక్.

సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు.. 2 లోక్‌సభ స్థానాలకు రెండు ఎంపీ సీట్లతో వందశాతం ఓట్లు సాధించిన జనసేన చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాల చర్చల ద్వారా తెలుస్తోంది. నిజానికి పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు, మరో మూడు మంత్రి పదవులు ఇస్తారన్న ప్రచారం నిన్నటి వరకూ ఉధృతంగా సాగింది.

అయితే.. తాజాగా పవన్ కల్యాణ్ క్యాబినెట్‌లో చేరబోవడం లేదని, ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తారన్న ప్రచారం జనసేనలో బలంగా వినిపిస్తోంది. ‘నేను ఎమ్మెల్యేగా మాత్రమే జీతం తీసుకుంటా. అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విలువైన అసెంబ్లీ బాధ్యతను ప్రజలు అప్పగించార’ని పవన్ తాజాగా చేసిన వ్యాఖ్య, ఈ అనుమానాలను బలపరుస్తోంది.

ఈ ఎన్నికల్లో 27 లక్షల 92 వేల 653 ఓట్లతో 8.49 శాతం సాధించి.. 21 అసెంబ్లీ స్థానాలకు 21 సీట్లు సాధించిన పవన్, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని భావించడం వెనుక కారణాలేమిటన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మంత్రివర్గంలో చేరితే ప్రభుత్వ లోపాలకు తాను కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ముందుచూపుతోనే, ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పైగా ఎన్నికల ప్రచారంలో పవన్ అనేక హామీలిచ్చారని, ప్రభుత్వం ద్వారా వాటిని మీకు అందించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చిన విషయం తె లిసిందే. తాను కూటమిలో చేరినప్పటికీ తప్పు జరిగే ప్రశ్నిస్తానని, ఆయన తొలి రోజుల్లోనే స్పష్టం చేయడాన్ని విస్మరించకూడదు. తాజాగా మెగా ఎస్సీ, నిరుద్యోగభృతి, సీపీఎస్‌కు ప్రత్యామ్నాయం కోసం పనిచేస్తానని కూడా మరోసారి ప్రకటించారు.

జగన్మోహన్‌రెడ్డి ఖాళీ చేసిన ఖజానాను పూడ్చటం సాహసంతో కూడుకున్నదని, అయితే చంద్రబాబు అనుభవంతో దానిని అధిగమించవచ్చని పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో హామీలు నెరవేర్చడం ఆలస్యమయితే, ఆ ప్రభావం వ్యక్తిగతంగా తనపైన-రాజకీయంగా జనసేనపై పడే ప్రమాదం ఉందన్న ముందుచూపుతోనే.. తాను క్యాబినెట్‌లోకి రాకుండా, విపక్ష పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు జనసేన వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే పవన్ దీనిపై ఇంకా ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు.