– రూ. 8 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
రంగారెడ్డి, మహానాడు: ఏసీబీ వలలో పెద్ద చేప, చిన్న చేప పడ్డాయి. వివరాలివి. ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని జక్కిడి ముత్యంరెడ్డి కోరారు. అయితే, ఈ పనికి రూ. 8 లక్షలు కావాలని సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి అవినీతి నిరోధక శాఖను సంప్రదించగా, ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు.
అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డికి బాధితుడు కారులో లంచం ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్టు ఏసీబీకి సీనియర్ అసిస్టెంట్ తెలిపారు. దీంతో అధికారులు ఘటనా స్థలం నుంచే జేసీకి ఫోన్ చేయించారు. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ కు చెప్పారు. పెద్ద అంబర్ పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి కి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు.