చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు

-సినీనటుడు నారా రోహిత్‌
-మడకశిర, పుట్టపర్తిలో ప్రచారం

మడకశిర: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం గుడిబండ, నీలకంఠాపురం, పుట్టపర్తి నియోజకవర్గంలో బీడుపల్లె తండాలో సినీ నటుడు నారా రోహిత్‌ పర్యటించారు. ఈ సందర్భంగా నీలకంఠాపురంలో యువతతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ జిల్లాకు ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమ కియా మోటర్స్‌ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ జిల్లాలకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు చంద్రబాబు సీఎం అయితేనే పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఎంఎస్‌ రాజు పేరులోనే మడకశిర ఉంది. ఐదేళ్లలో సైకో ముఖ్యమంత్రి మీద ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు ఎంఎస్‌ రాజు. ఏ తప్పు చేయకపోయినా 55 అక్రమ కేసు బనాయించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం.ఎస్‌.రాజు, ఎంపీ అభ్యర్థిగా పార్థసారథిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమేల తిప్పేస్వామి, శత జయంతి ఉత్సవాల కన్వీనర్‌ అట్లూరి నారాయణరావు తాడికొండ సాయికృష్ణ పాల్గొన్నారు.