అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
మహానాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కులాల రిజర్వేషన్ ప్రక్రియలో ఉప వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను, ఎస్టీలకు ఉన్న 7.5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వాలు పెంచాల్సిన అవసరం ఉందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీనితోపాటు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు బాగా తగ్గినందున, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో కూడా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు జరిపేందుకు ప్రభుత్వాలు దోహదం చేయాలని కోరారు. ప్రజాస్వామిక దేశంలో ఆయా సామాజిక వర్గాలు వారి ఉద్యోగ, విద్య అవకాశాలను కోరుకోవడంలో తప్పు లేదని, కానీ ఉప వర్గీకరణ అంశం రాజకీయ పార్టీలకు నైవేద్యంగా మారి కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రల పట్ల ఆయా సామాజిక కులాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సుదీర్ఘమైన న్యాయ పోరాటంలో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని మరువరాదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉప వర్గీకరణకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో అనుకూల అఫిడవిట్ దాఖలు చేసినందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 పద్దతిలో ఉప వర్గీకరణ అమలును ఆయా రాష్ట్రాలకు హక్కులు కల్పిస్తూ తీర్పు ఇచ్చినట్లు అభిప్రాయపడ్డారు.
ఈ తీర్పును ఒకరికి జయం గానూ , మరొకరికి అపజయం గానూ, కొందరికి ఖేదం గానూ , ఇంకొందరికి మోదంగానూ భావించవద్దని తెలిపారు. రాబోవు కాలంలో ఉప వర్గీకరణ అంశం రాజకీయ పార్టీలకు పావులుగా మారే ప్రమాదం ఉందని, ఎస్సీ ఎస్టీలు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఐక్యతను పాటించాలని తెలిపారు. అణగారిన వర్గాలు ఐక్యమత్యంతో ఉంటేనే అణచివేతలను ఎదుర్కొగలవు అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హితవును ఏ వివక్షా కులం మరువ కూడదని పేర్కొన్నారు. ఏ జాతి, ఏ సామాజిక వర్గం చైతన్యంతో ఉంటుందో, ఐక్యతను చూపుతుందో, అలాంటి జాతి మనుగడలో ఉంటుందన్న సత్యం మరువరాదని బాలకోటయ్య ఎస్సీ ఎస్టీ మేధావులకు, నాయకులకు, ప్రతినిధులకు సూచించారు.