– కోల్డ్ స్టోరేజ్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలి
– ఎస్పీ, బ్యాంకర్లతో ఫోన్ లో మాట్లాడిన పెమ్మసాని
గుంటూరు, మహానాడు: అన్నదాత జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని రూరల్ డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరులోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం కొందరు రైతులు పెమ్మసాని ని కలిసి కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరిచిన మిర్చి బస్తాలను దొంగతనంగా అమ్ముకోవడంపై తమ సమస్యలు విన్నవించుకున్నారు.
కర్నూలు ఆలూరు నంద్యాల బళ్ళారి పల్నాడు మార్కాపురం ఇతర ప్రాంతాలకు చెందిన మిర్చి రైతులమైన తాము పండించిన పంటను నగరంలోని నల్లపాడు పరిధిలోగల ఓ కోల్డ్ స్టోరేజ్ లో కొన్నాళ్ల కిందట భద్రపరుచుకున్నామని చెప్పారు. అయితే, స్టోరేజ్ కు చెందిన యజమాని నకిలీ వ్యక్తుల పేర్లు, ఆధార్ కార్డులతో రైతుల పేరిట లోన్లు తీసుకోవడమే గాక, తాము భద్రపరచుకున్న మిర్చి బస్తాలను తమకు తెలియకుండా అమ్ముకున్నారని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ అయిందని, అయితే తమ గోడు ఎవరూ పట్టించుకోవడంలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత రైతులు పెమ్మసానిని విన్నవించుకున్నారు.
తక్షణ స్పందన
రైతుల బాధ విన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెంటనే స్పందించారు. రైతుల సమక్షంలోనే ఎస్పీ సతీష్ కుమార్ కి, అలాగే రుణాలు మంజూరు చేసిన బ్యాంకర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. హుటాహుటిన కార్యాలయానికి అధికారులను పిలిపించారు. రైతుల ఎదుటే జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ నిందితులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అరెస్టులు కాదు, రైతులకు న్యాయం జరగాలి అని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సమస్య పరిష్కారం కావాలని ఆదేశించారు. రైతుల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు.