ఫోన్‌ ట్యాపింగ్‌పై స్పందించిన కేసీఆర్‌

` ఇంటెలిజెన్స్‌ నివేదికలు మాత్రమే వస్తాయి
` వారు ట్యాపింగ్‌ చేశారో లేదో మాకేం సంబంధం
– ఆ అంశం ఆరోపణకు కూడా పనికిరాదని వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మహానాడు : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రేవంత్‌ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని అనుకోలేదని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదిక లివ్వడం అత్యంత సహజమన్న ఆయన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం అసలు ఆరోపణకు కూడా పనికిరాని అంశమని కొట్టి పడేశారు. ఓ ప్రముఖ మీడియా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి గూఢచారులు ఇచ్చిన నివేదికలు సీఎం, ఇతర మంత్రుల చేతికి వస్తాయని…కానీ, వాళ్లు ట్యాపింగ్‌ చేశారా? లేదా? అనేది మాకేలా తెలుస్తుందని ప్రశ్నించారు. అది తమ పరిధిలోకే రాదని.. ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత తెలివితక్కువగా ఆలోచిస్తుందని తాను అనుకోలేదని చెప్పారు.

మోదీ వికృతరూపానికి నిదర్శనం…కుమార్తె అరెస్ట్‌

తమ పదేళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించామని.. ఐదు నెలల పాలనలోనే ప్రజలను కాంగ్రెస్‌ రాచిరంపాన పెట్టిందని మండిపడ్డారు. ఆ ప్రభావం పార్లమెంట్‌ ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలను రెఫరెండమన్న సీఎం రేవంత్‌ తోక ముడిచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి వస్తుందని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే కొలువుదీరనుందని ఉద్ఘాటించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మెజార్టీ సీట్లు సాధిస్తుందని. సంకీర్ణ ప్రభుత్వంలో తాము కీలక పాత్ర పోషిస్తా మన్నారు. ప్రధాని మోదీ వికృతరూపానికి ఢల్లీి మద్యం కేసు నిదర్శనమని కేసీఆర్‌ ఫైరయ్యారు. ఆడబిడ్డ అని చూడకుండా అప్రజాస్వామికంగా, అరాచకంగా, క్రూరంగా తన కుమార్తె కవితను జైళ్లో పెట్టించా రని ధ్వజమెత్తారు. మోదీ వికృత పాలనకు ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు.