యువకులతో కరచాలనం…ఆప్యాయంగా సెల్ఫీలు
అనుకోని అతిథితో యజమాని పట్టరాని ఆనందం
మీరు లేకపోవుటే కష్టాలకు కారణమని రైతుల గోడు
ఖమ్మం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్ ఎల్లంపేట స్టేజీ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న చిన్న చాయ్ హోటల్ వద్ద ఆగారు. అనుకోకుండా వచ్చిన మహానేతను చూసి యజమాని సొందు, కుటుంబసభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. మిర్చి బజ్జీతో పాటు అల్పా హారం ఇచ్చారు. వారి అతిథ్యాన్ని స్వీకరించిన కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సొందు ఇచ్చిన చాయ్ తాగారు. అక్కడకు వచ్చిన యువకులతో కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు. కేసీఆర్ వస్తున్నారని తెలిసి తండా సర్పంచ్ లాల్సింగ్ సహా పలువురు అక్కడకు చేరుకున్నారు.
రైతులు తమకు రైతుబంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, నీళ్లందక పొలాలు ఎండిపోయాయని, కరెంటు రావట్లేదని గోడు వెళ్లబోసుకున్నారు. దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు వారి సమస్యలు చెప్పుకున్నారు. మీరు లేకపోవుటే ఇన్ని కష్టాలకు కారణం సారు…మాయమాటలు నమ్మి మోసపోయినం.. మల్లా మీరే రావాలి అం టూ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కేసీఆర్ బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతుబంధు, రుణమాఫీ తదితర కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ఉద్యమిస్తామని భరోసా ఇచ్చారు. మహబూ బాబాద్ ఎంపీగా పోటీ చేస్తోన్న మాలోత్ కవితను గెలిపించాలని కోరారు. అనంతరం జై కేసీఆర్ అన్న నినాదాల మధ్య ఎల్లంపేట చౌరస్తా తండా నుంచి కేసీఆర్ ఖమ్మం వైపు ముం దుకు కదిలారు.