ఖాదీ…. గాంధీ చూపిన దారే!

– చేనేత కార్మికులకు అండగా ఉందాం
– ఎంపీ సీఎం రమేష్‌

విశాఖపట్నం, మహానాడు: ఖాదీ… గాంధీ చూపిన దారేనని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. గాంధీ జయంతి, సేవాపక్షోత్సవాలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇక్కడి కేంద్ర కార్యాలయ ఆవరణలో బుధవారం ఖాదీ సంతను నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం రమేష్ హాజరయ్యారు. ముందుగా కూటమి నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అత్యంత ప్రముఖుడైన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపు జీవితం, సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. గాంధీ అందించిన బాటలో పయనిస్తూ ఆయనని స్మరించుకుందామని, సత్యం, అహింస సూత్రాలను దృఢంగా అనుసరించారని పేర్కొన్నారు. అదేవిధంగా 11 ఏళ్ల నుండి బీజేపీ కార్యాలయంలో ఖాదీసంత ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతన్నలు, ఖాదీ వర్తకులతో, వివిధ రకాల అమ్మకం స్టాల్స్ వర్తకులతో ముచ్చటించారు.

అనంతరం కార్యాలయంలో భారతదేశ రెండో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కూడా నివాళులర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి తన జీవితాన్ని దేశ సైనికులు, రైతులు, ప్రజల కోసం అంకితం చేశారని…. జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని లేవనెత్తిన మహోన్నత వ్యక్తి సేవలను స్మరించుకోవాలి అని తెలిపారు.

ప్రదర్శనలోని వివిధ రకాల స్టాల్స్ వద్దకు వెళ్లి ఖాదీ వస్త్రాలను విక్రయించారు. కార్యక్రమంలో చోడవరం శాసన సభ్యుడు కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్, విశాఖ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, కూటమి నాయకులు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద మహాత్మా గాంధీ, శాస్త్రికి బీజేపీ నాయకులతో కలిసి నివాళులర్పించి, అక్కడ ఏర్పాటుచేసిన ఖాదీ వస్త్ర అమ్మకం స్టాల్స్ ను సందర్శించి, మోడీ జీవిత విశేషాలను చిత్రపటాలను ఆసక్తి గా తిలకించారు.