-కేంద్రం దొడ్డు బియ్యానికి సిద్ధంగా ఉన్నా స్పందించరా?
-చెయ్యి గుర్తుపై ఓటేసినందుకు భస్మాసుర హస్తమేనా?
-రాష్ట్రం ప్రభుత్వ వైఖరిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దొడ్డు బియ్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నా…రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ఆయన గురువారం ఉదయం బీబీనగర్ మండలం రాఘవాపూర్, రుద్రవెల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, వెయిటింగ్‌లో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 45 రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస వసతులు లేవు. ట్రాన్స్‌పోర్టు, బస్తాలు, హమాలి చార్జీలు ఇలా మొత్తం కేంద్రం రాష్ట్రానికి చెల్లిస్తుంది. రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుంది. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు ఏం నొప్పి అని నేను అడుగుతున్నాను. ధాన్యం ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ ధాన్యం మొలకలొస్తుంటే ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదా? అని ప్రశ్నించారు. నాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్? అంటే.. ఇప్పుడు దొడ్డు వడ్లు వేస్తే ఉరి అని రేవంత్ అంటున్నాడు. చెయ్యి గుర్తుకు ఓటు వేసినందుకు రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం భస్మాసుర హస్తం పెడుతుంది.
సన్న వడ్లకు రూ.1000 బోనస్ ఇవ్వండి
ఈ ప్రభుత్వం సన్నరకం వడ్ల సాగును ప్రోత్సహించాలనుకుంటే వాటికి రూ.1000 బోనస్ ఇవ్వండి, దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలి. ఆరు గ్యారంటీల అమలును పక్కన పడేసి సీఎం రేవంత్, మంత్రులు ఢల్లీి టూర్లు, ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. ఇక్కడి సంపదను కొళ్లగొడుతూ ఢల్లీి పార్టీకి సూట్ కేసులు మోస్తున్నారు. బీజేపీ కిసాన్ మోర్చా ప్రతినిధులు అంతా కొనుగో లు కేంద్రాలకు వెళ్లి రైతులకు అండగా నిలబడాలని కోరారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని, సీజన్‌కు ముందే పంట పెట్టుబడి సాయం అందించాలని కోరారు. లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.