కామంతో విజయసాయిరెడ్డి, డబ్బు మదంతో పేర్ని నాని మాట్లాడుతున్నారు

-విజయసాయికి పిచ్చి పట్టింది
-విలేకరులను ఒరేయ్ అనడం సిగ్గు పడాల్సిన విషయం
-తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు
– ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయికి పిచ్చి పట్టిందని ఆయన అన్నారు. ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులను ‘ఒరేయ్, ఏరా’ అని అనడం సిగ్గు పడాల్సిన విషయమని చెప్పారు. ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇవ్వకుండా… మీడియా ప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి తప్పులు చేశారని… ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మీడియా సంస్థల యాజమాన్యాలు, విలేకరులపై ఆయన చేసిన విమర్శలకు… భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. కామంతో విజయసాయిరెడ్డి, డబ్బు మదంతో పేర్ని నాని కళ్లుమూసుకుపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. విచారణ జరిపి త్వరలోనే అన్ని లెక్కలు తేలుస్తామని చెప్పారు.