Mahanaadu-Logo-PNG-Large

కోమటిరెడ్డి..డాక్టర్‌కు చూపించుకో!

ప్రభాకర్‌రావును కలిసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
రుజువు చేయలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్‌

హైదరాబాద్‌: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. ఆయనకు మతిభ్రమించింది.. డాక్టరుకు చూపించుకోవడం మంచిది. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్‌రావును కలిసినట్టు మంత్రి వెంకట్‌ రెడ్డి మాట్లాడారు. రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం. రుజువు చేయకపోతే వెంకట్‌ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలి. నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నదీ తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.

నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకుని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్‌ ఇన్‌ అండ్‌ అవుట్‌ వివరాలు ఉంటాయి.కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనమని మండిపడ్డారు. కోమటిరెడ్డి చెప్పిన తేదీన, చెప్పిన టైంకు అమరవీరుల స్తూపం వద్దకు వస్తా…మీరు ఆధారాలతో రావాలని సవాల్‌ విసిరారు. టీవీల్లో బ్రేకింగ్‌, స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవుపలికారు. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకుని కోమటిరెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవాలని సమాధానమిచ్చారు.