– విజయవాడ కలెక్టరేట్ లో ఎన్ బీకే సేవా సమితి తరపున కోటంరెడ్డి ఐదు లక్షలు, కోటంరెడ్డి సంధ్యా మరో ఐదులక్షలు చంద్రబాబుకు అందజేత
– వరద బాధితుల కోసం పాతికేళ్ల యువకుడిలా పనిచేస్తున్నారంటూ కోటంరెడ్డి కితాబు
– మీలాగే అందరూ ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలన్న చంద్రబాబు
– ఆపదలో ఉండే ప్రజలను ఆదుకోవాలనే మీ దంపతులు ఆలోచన నచ్చిందని చంద్రబాబు ప్రశంస
విజయవాడ: రాష్ట్ర ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించే చంద్రబాబు నాయుడు వరద బాధితులకు అండగా ఉండేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి, ఎన్ బీ కే సేవా సమితి కన్వీనర్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఆయన పిలుపు మేరకు తన వంతు బాధ్యతగా.. ఎన్ బీకే సేవా సమితి తరపున పదిలక్షల రూపాయల ఆర్దిక సాయం చేసినట్లు ఆయన వెల్లడించారు.
విజయవాడలోని కలెక్టరేట్లో చంద్రబాబును కలిసి.. కోటంరెడ్డి, ఆయన సతీమణి సంధ్యారెడ్డి.. పది లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు వారిద్దరిని అభినందించారు. మీలాగే అందరూ ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీ ఆలోచన అందరినీ స్పూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు.
పాతికేళ్ల యువకుడిలా మీరు వరద బాధితులకు చేస్తున్న సేవే తమకు స్పూర్తి అని కోటంరెడ్డి చంద్రబాబు దగ్గర వ్యాఖ్యానించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హుదూద్ లాంటి భారీ విపత్తునే చంద్రబాబు నాయుడు హ్యాండిల్ చేశారని, విజయవాడ వరదలను కూడా సమర్దవంతంగా ఎదుర్కోవడంతో పాటు.. ప్రజలకు అండగా నిలిచారని ఆయన అన్నారు.
వైసీపీ నేతలు చేస్తున్న బురద రాజకీయాన్ని విజయవాడ ప్రజలు అసహ్యించుకుంటున్నారని, వెళ్లిన ప్రతిచోటా ప్రజల నుంచి వారికి నిరసనలు ఎదురవుతున్నాయని కోటంరెడ్డి మండిపడ్డారు. బాలయ్య సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు పది లక్షల రూపాయల చెక్కును వరద బాధితుల సహాయార్దం అందించామని అన్నారు.