కోటప్పకొండకు టీడీపీ శ్రేణుల పాదయాత్ర

ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు
కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ

నరసరావుపేట: నియోజకవర్గంలో జగన్‌రెడ్డి అరాచకాలను, అకృత్యాలకు ఎదు రొడ్డి చదలవాడ అరవిందబాబు గెలిచిన నేపథ్యంలో పమిడిపాడు గ్రామ టీడీపీ నేతలు కోటప్పకొండకు పాదయాత్ర చేపట్టారు. చదలవాడ అరవిందబాబు దగ్గరుండి పాదయాత్రను ప్రారంభించారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని అడ్డుకునే సత్తా ఎవరికీ లేదన్నారు. ప్రజల అండ, కార్యకర్తల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. పార్టీని ప్రాణంగా భావించే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతమన్నారు. దేశంలో కార్యకర్తల ఆశీర్వాదంతో నడిచే పార్టీ తెలుగుదేశం మాత్రమేనన్నారు. కార్యకర్తల కష్టానికి ప్రతి ఫలం తప్పకుండా దక్కుతుందని, ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి తీరుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.