కోటి వేల్పుల అండ … కోటప్పకొండ

– మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం
(వాసిరెడ్డి రవిచంద్ర)

నరసరావుపేట: ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం దేశంగురించి తెలియని వారు ఉండరు. దేశంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో కోటప్పకొండ ఒకటిగా విరాజిల్లుతోంది. త్రికూటాచలం నామస్మరణ తో మోక్షం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు. పావనకృష్ణ నది తీరాన దక్షిణ భాగాన యల్లమంద,కొండకావురు మధ్యగల పర్వత రాజే ఈ త్రికూటాచలం. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.భక్తుల శివ నామ స్మరణతో కోటప్పకొండ నిరంతరాయంగా మారుమోగిపోతుంటుంది.

కోటప్పకొండ లో వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్లు వేడుక ఆతరువాత 2008లో రాష్ట పండుగ హోదా సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం అనేకమంది భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలి వస్తారు. వేసిన పంట చేతికి రావాలని రైతులు, కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు పెద్దఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటారు. తమ తమ గ్రామాలు పచ్చని పాడిపంటలతో అష్టైశ్వర్యాలతో తల తూగాలంటే కోటప్పకొండకు ప్రభ కట్టుకొని వెళ్ళాలని ఇక్కడి ప్రజలు భావిస్తారు.

గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చే వారు ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందంటే త్రికోటేశ్వరుడి మహత్యం ఏ పాటిదో అర్ధం అవుతుంది. అడుగడుగునా శివ నామ స్మరణతో కోటప్పకొండ ఆలయం నిత్యం మారుమ్రోగుతుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించి రివ్యూ మీటింగ్ లో అన్ని శాఖలు సమన్వయంతో పని చేసేందుకు జిల్లా కలెక్టర్ శివ శివశంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు.

తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.భక్తులు కొండకు వచ్చి పోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3000 వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిసి కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

కొండ దిగువ భాగం నుండి కొండ పైకి వెళ్లేందుకు బస్సులు నిరంతరం తిరుగుతుంటాయని అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనార్థం కొండకు వచ్చే భక్తుల కోసం మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈవో గొల్లమారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొన్ని స్వచ్చంద సంస్థలవారు ముందుకు వచ్చి మంచినీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు.అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు, పాలు సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు, అలాగే ఘాట్ రోడ్డు నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని అన్నారు.

ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2 లక్షల 50 వేల లడ్లు, 1 లక్ష అరిసెలు సిద్ధం చేశామని ఆలయ ఈవో తెలియచేసారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహా శివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరుని కి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచ హారతులు, మహా నివేదనములు, అష్టోత్తరములు, దీపోత్సవములతో స్వామి వారికి పండుగ నాడు పూజలు నిర్వహిస్తారని ఆలయ ఆర్చకులు తెలిపారు.

పండుగ నాడు త్రికోటేశ్వరుని ప్రీతి ఐన ప్రభలతో అనేక గ్రామాల నుండి భక్తులు చేదుకో కోటయ్య అంటూ కోటప్పకొండకు తరలి వస్తారు. పండుగ నాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు, అనేక రకముల వినోద భరిత ప్రదర్శనలతో కోటప్పకొండ తిరునాళ్ల అంగ రంగ వైభవంగా జరుగుతుంటుంది