Mahanaadu-Logo-PNG-Large

డీఈఓ ఆఫీస్ లో కలవరం

కృష్ణా జిల్లా కలెక్టర్ తనిఖీ

మచిలీపట్నం, మహానాడు: అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా అమలు జరపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్  కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, యాప్ తీరుతెన్నులను జిల్లా విద్యాధికారి తహేరా సుల్తాన్ ను అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజన పథకానికి అందుతున్న బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్లు, చిక్కీలు తదితర వస్తు సామాగ్రి వాటి వినియోగం విద్యార్థుల హాజరు ఎంతమంది విద్యార్థులకు గాను, ఎంతమంది భోజనం తింటున్నారు, ఎంతమంది తినడం లేదు, ఎందుకు తినడం లేదు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలల్లో ఏమైనా కావలసిన పనులకు సంబంధించి సిఎస్ఆర్ నిధులతో పూర్తి చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో భోజన పథకం సరిగా అమలు అవుతుందా లేదా  క్రమం తప్పకుండా పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసి పరిశీలించాలన్నారు. ఎంఈఓలతో ప్రత్యేకించి ఒక వాట్సాప్ గ్రూప్ సిద్ధం చేసి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తామన్నారు. వారితో త్వరలో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యావ్యవస్థను పటిష్ట పరుస్తామన్నారు.

ఈ తనిఖీలో జిల్లా విద్యాధికారితోపాటు ఏడీలు ఎం ఏ అజీజ్, మనోహర్ నాయక్, పర్యవేక్షకులు పవన్ కుమార్, సలీం, సముద్రేశ్వరరావు పాల్గొన్నారు