రాజకీయంగా సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీష్

– ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధ రహితం
– బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా గడీల్లో పడుకోలేదు ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం
– ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదు
– అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న సిబ్బందికి అభినందనలు
– జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రా ను సిద్ధం చేశాం
– బిఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోయింది
– నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తాం.
– వరద ఉధృతి తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి ఆదుకుంటాం
– సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నది
– ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజా ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని వాళ్లు చేసిన పాపాల పై నిలదీస్తారన్న భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సప్ సోషల్ మీడియాలో కేటీఆర్ హరీష్ రావు రాజకీయంగా బతికేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు.

అనుకోని విధంగా వచ్చిన ఈ విపత్తును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడ స్వల్ప ప్రాణనష్టం కూడా జరగలేదని వెల్లడించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైయస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలకు పని లేకుండా ఉన్నారని వారు చేస్తున్న విమర్శలు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా ప్రజా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గడిల్లో పడుకోలేదని, ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు చేశామన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ప్రజల మధ్యన ఉండి ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్లనే భారీగా వచ్చిన ఈ విపత్తులను అధిగమించామన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగి పోయినవని.

కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చిన హైదరాబాదు నేడు సురక్షితంగా ఉన్నదంటే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమే అన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగిస్తూ వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా ప్రస్తుతం ఈ విపత్తును ఎదుర్కోవడానికి రెడీగా ఉందన్నారు. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ టీంలను రంగంలోకి దింపిందన్నారు. ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కోవడానికి హైడ్రా సిద్ధంగా ఉందని చెప్పారు.

విద్యుత్ అంతరాయం లేకుండా చూడడానికి సిబ్బంది ఉరుములు మెరుపులు మధ్యన పిడుగులు పడుతున్న ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అర్ధరాత్రులు రోడ్లపైనే ఉండి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తూ సేవలు అందించిన విషయం ప్రతిపక్షాలకు కనబడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగ ధర్మం కాకుండా సామాజిక ధర్మాన్ని పాటిస్తూ అర్థరాత్రులు సైతం విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.

నిరాశ్రయులకు తక్షణమే నిత్యావసర సరుకులు పంపిణీ
భారీ వర్షాలు కురవడం వల్ల పొంగి పొర్లిన వరదల వల్ల నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యవసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే పునరావస కేంద్రాలకు తరలించిన ప్రజలకు భోజన వసతితో పాటు వారికి మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ యంత్రాంగం అందించిందన్నారు.‌ వరదలు తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని చెప్పారు.

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఖమ్మంలో మున్నేరు ఉప్పొంగడంతో కొంతమేర నష్టం జరిగిందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.