కూటమి పాలనలో గ్రామీణాభివృద్ధి చిగురులు తొడుగుతోంది..

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా

సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్రంలో కూటమి పాలనలో గ్రామీణాభివృద్ధి నేడు చిగురులు తొడుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం, నందిగామలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్ద పీట వేశారు.

జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బతికిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు చీకట్లో మగ్గిన గ్రామాలు నేడు వెలుగులతో నిండబోతున్నాయి. జగన్ రెడ్డి పాలనలో పంచాయితీల్లో బ్లీచింగ్ చల్లే పరిస్థితులు లేని దశ నుండి గ్రామాలు నూతన హంగులు సంతరించుకునే పరిస్థితి చంద్రబాబు పాలనలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో పంచాయతీలకు చెందాల్సిన రూ.13వేల కోట్లు తన సొంత ఖాతాకు మళ్లించుకుని గ్రామాలకు ద్రోహం చేశారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించారు.

జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నరకప్రాయమైన గుంతల రాజ్యాన్ని పరిచయం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే గ్రామీణాభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం నుండి వచ్చిన రూ.990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకం కింద రాష్ట్ర వాటాగా రూ.500 కోట్లు మొత్తం రూ.1,490 కోట్లను గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేశారు. రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 17,500 కిలో మీటర్ల సీసీ రోడ్లు నిర్మించేందుకు చంద్రబాబు నేతృత్వంలో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.

గ్రామాల్లో మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం ఏకంగా 10వేల కిలోమీటర్ల డ్రైనేజీల నిర్మాణానికి చంద్రబాబు మార్గాన్ని సుగమం చేశారు. 2014-19 మధ్య కాలంలో చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలు నిర్మిస్తే.. జగన్మోహన్ రెడ్డి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం. జనసేన, బీజేపీ. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.