ప్రవాస భారతీయ తెలుగుదేశం ప్రతినిధుల హామీ
టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు తరపున ప్రచారం
వినుకొండ, మహానాడు : ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన 20 లక్షల కొలువుల హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర యువతలో కనీసం లక్షమందికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నారై తెలుగుదేశం ప్రతినిధులు హామీ ఇచ్చారు. యువతలో నైపుణ్యాలు పెంచి యూరప్, అమెరికా, గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎన్‌రైజ్ ఏపీ పేరుతో ఊరూరా ప్రచారం నిర్వహిస్తోన్న ఎన్నారై టీడీపీ ప్రతినిధులు గురువారం వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులును కలిశారు. బొల్లాపల్లి మండల ప్రచారంలో సంఫీుభావం తెలిపారు.
ఆ సందర్భంగా ఏపీ యువతకు లక్ష విదేశీ ఉద్యోగాల పోస్టర్లను జీవీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ మంచి ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రానికి, యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంద న్నారు. ఇంతమంది ఎన్నారైలు ప్రచారానికి తరలిరావడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ రాష్ట్రంపై ప్రేమ.. ఇక్కడి అధ్వాన పరిస్థితులపై కసితోనే వారంతా వస్తున్నారని స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య కీలకాంశం కావడంతో విదేశాల్లోనూ తెలుగు యువతకు లక్ష ఉద్యోగాలు అనే సంకల్పం తీసుకున్నామన్నారు. ఎన్నారైల్లో కనీసం 5 వేల మంది తమ సంస్థల్లో ఏడాది ఐదుగురికి చొప్పున ఐదేళ్ల కాలంలో 20 మందికి ఉపాధి కల్పిస్తే సునాయాసనంగా లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలుగుతామని పేర్కొన్నారు. విదేశా ల్లో ఉపాధి కల్పనకు దోహదపడే విధంగా తెలుగుదేశం పార్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ చాలా కాలంగా నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.